విధాత:పులిచింతల ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు డీఈఈ రఘునాథ్ సూచించారు.ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పులిచింతలకు భారిగా వరదనీళ్లు తరలి వస్తుండడంతో దిగువకు నీరు విడుదల చేయనున్నామని అన్నారు.ప్రాజెక్టు సామర్ధ్యం 45.77 టీఎంసీలు ఉండగా ఇప్పటికే 41.24 టీఎంసీలు నీటిని నిల్వ ఉంచినట్లు తెలిపారు.ఎగువనుంచి 313962 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా అంతే మొత్తాన్ని దిగువ కృష్ణకు వదులుతున్నామని అన్నారు. 5 గేట్లను 2.5 మీటర్ల మేర ఎత్తి 305962 క్యూసెక్కుల నీరు వదులుతుండగా పవర్ జనరేషన్ కు మరో 8000 క్యూసెక్కుల నీరు పోతున్నదని చెప్పుకొచ్చారు.దిగువకు నీరు విడుదల కావడంతో నది జలకళ సంతరించుకుంది. కాలువలు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు వరదనీళ్లు భారీగా తరలివస్తున్నాయని దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అచ్చంపేట మండల తహశీల్దార్ క్షమారాణి,ఎస్సై మణికృష్ణ ప్రజలను కోరారు.
నదిలోకి ఎవరు చేపలవేటకు వెళ్ళొద్దని అన్నారు.అలాగే లంకప్రాంతాల్లో సాగు చేస్తున్న రైతులు పొలలాలకు పోవద్దన్నారు.పశువులు, జీవాలను మేతకోసం లంక భూములకు తీసుకెళ్లవద్దని హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వరద సహాయం కోసం వెంటనే తమను ఫోన్ ద్వారా సంప్రదించాలని కోరారు.