విశాఖ పట్నం : విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బుధవారం ఉదయం బెతాని పాఠశాలకు చెందిన విద్యార్థులు వెళుతున్న ఆటో వేగంగా వెళ్లి లారీని ఢీకొన్నది. ఈ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సంఘం శరత్ థియేటర్ జంక్షన్ లో ఫ్లై ఓవర్ వద్దకు రాగానే అడ్డంగా వేగంగా వెళుతున్న లారీని ఆటో అంతే వేగంతో వెళ్లి ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న పిల్లలు గాల్లోకి ఎగిరి చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయారు. వెంటనే చుట్టుపక్కలవారంతా అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా ఎనిమిది మంది పిల్లలకు గాయాలవ్వగా నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రమాదానికి ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు వెల్లడించారు.