విధాత:అమరావతి: తెలంగాణ చర్యల వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోయిందని ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నట్టు చెప్పారు.అక్టోబరు 14 నుంచి జల్‌శక్తి శాఖ నోటిఫికేషన్ అమలులోకి వస్తుందన్నారు. బేసిన్ పరిధిలో లేని వాటినీ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారని,వాటిని సవరించాల్సి ఉందన్నారు. వెలుగొండపై తలెత్తిన అక్షర దోషాలను సవరించాలని కేంద్రాన్ని కోరతామన్నారు.
‘‘సాగునీరు విడుదల చేసినప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేయాలి. విద్యుత్ ఉత్పత్తి కోసం సాగునీరు విడుదల చేయకూడదు. విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే కేఆర్‌ఎంబీ అనుమతి తీసుకోవాలి.
కేఆర్‌ఎంబీ అనుమతి లేకుండానే 45 రోజులుగా తెలంగాణ జెన్‌కో శ్రీశైలం,సాగర్,పులిచింతల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసింది. శ్రీశైలం ప్రాజెక్టుకు 30.38 టీఎంసీల ఇన్‌ఫ్లో ఉంటే,అందులో 29.82టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడారు.దీంతో శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం 806.8 అడుగులు మాత్రమే ఉంది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు తీసుకోవాలంటే కనీసం 854 అడుగులు ఉండాలి.
దీంతో పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసిన 8టీఎంసీల నీరు సముద్రం పాలైంది. జూన్ నుంచి ఇప్పటివరకు తెలంగాణ 66 టీఎంసీలు విద్యుత్ ఉత్పత్తి కోసం వాడింది. దీనిపై సీఎం జగన్ ప్రధానికి ఫిర్యాదు చేశారు. కేఆర్‌ఎంబీ పరిధి నిర్ణయించడంతో పాటు, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, భద్రత బోర్డు పరిధిలో ఉండేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. ఈ క్రమంలో కేంద్ర జల్‌శక్తి శాఖ కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నాం’’ అని శ్యామలరావు తెలిపారు.