ఇటీవల సురేష్ కొండేటి పేరు ఎక్కువగా వినిపిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. సినిమా ప్రెస్‌మీట్లలో విచిత్ర ప్రశ్నలు వేస్తూ ఆయన అందరి దృష్టిని ఆకర్షించాడు. కొన్నేళ్లుగా సురేష్ కొండేటి ఇండస్ట్రీలోని నటీనటులకి , టెక్నీషియన్స్‌కి సంతోషం అవార్డులని అందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. అయితే ఈ సారి అవార్డుల వేడుక గోవాలో నిర్వహించగా, దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కన్నడ నుంచి వచ్చిన నటీనటులకు అసౌకర్యం కలగడంతో ఈ విషయం చిన్న దుమారానికి దారి తీసింది. అయితే ఆ నిర్వాహకుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన పిఆర్ఓగా కన్నడ మీడియా వర్గాల్లో ప్రచారం జరగడంతో నిర్మాత అల్లు అరవింద్ దానిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.
ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అరవింద్.. ఆ కార్యక్రమంలో ఈ వివాదం గురించి మాట్లాడాడు. ఒక ప్రైవేట్ జర్నలిస్ట్ ఎప్పటి నుంచో ఈ ఫంక్షన్ చేస్తున్నాడని, ఈసారి ఫెయిల్ కావడం అతని వ్యక్తిగత బాధ్యత తప్పించి మా కుటుంబానికి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అతడు (సురేశ్ కొండేటి) తమ పీఆర్వో కాదని, తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇతర భాషల వారికి కొన్ని ఇబ్బందులు జరిగాయి. వాళ్లు తెలుగు ఇండస్ట్రీని నిందిస్తున్నారు. కానీ ఇది వ్యక్తిగత విషయం. తెలుగు ఇండస్ట్రీ ఇంతే.. వాళ్లు ఇంతే అని కొందరు మాట్లాడడం, కొన్ని పత్రికల్లో రావడం చూసి నాకు చాలా బాధ అనిపించింది.
ఒక వ్యక్తి చేసిన దానిని ఎవరికో ఆపాదిండం కానీ.. ఇండస్ట్రీకి ఆపాదించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. నా విన్నపం ఏంటంటే.. అతను ఎవరికీ పీఆర్వో కాదు.. మా కుటుంబంలో కూడా ఎవరికీ పీఆర్వో కాదు. అతను ఇండస్ట్రీకి ద్రోహం చేయాలని కాదు. అతడి వ్యక్తిగత ఫెయిల్యూర్ అది అని అల్లు అరవింద్ స్పష్టం చేశాడు. . ఏవో బిల్లుల చెల్లింపులో జరిగిన ఆలస్యం వల్ల విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పాటు హోటల్ వ్యయం సమయానికి జమ చేయకపోవడం వల్ల రభసకు దారి తీసిందని అంటున్నారు. సదరు వ్యక్తి గురించి పేరు కానీ, ఇంకే ఇతర వివరాలు కానీ అల్లు అరవింద్ నేరుగా ప్రస్తావించలేదు.