గంగుల మరో అనుచరుడి అరెస్ట్

గంగుల కమలాకర్‌ అనుచరుడు శ్రీపతిరావును పోలీసులు అరెస్టు చేశారు.

  • Publish Date - February 7, 2024 / 02:44 AM IST

  • పరారీలో ఉండగా వేటాడి పట్టుకున్న పోలీసులు

విధాత బ్యూరో, కరీంనగర్: మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ మరో అనుచరుడు తోట శ్రీపతిరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుల పరారీలో ఉన్న ఆయన హైదరాబాద్ అంబర్ పేట లోని తన సోదరుని నివాసంలో తల దాచుకున్నట్టు గుర్తించిన పోలీసులు ఆయనను అక్కడి నుండి అరెస్టు చేసి తీసుకువచ్చారు. భూ కబ్జాలకు సంబంధించిన కేసులో స్థానిక పోలీసులు శ్రీపతిరావును జిల్లా అడిషనల్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. గతంలో ఆర్టీఏ సభ్యునిగా పనిచేసిన శ్రీపతిరావు.. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు ముఖ్య అనుచరునిగా ఉన్నారు. గంగులకు చెందిన గ్రానైట్ రవాణా వ్యవహారాలను ఆయన చక్కబెడుతున్నారు.


గంగుల కమలాకర్ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన భూ కబ్జాల వ్యవహారంలో శ్రీపతిరావుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయి ఉన్నాయి. కరీంనగర్ పట్టణం వివేకానందపురి కాలనీకి చెందిన హనుమాన్ల రవీందర్ 2014 లో తీగల గుట్టపల్లి లో 144 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. అందులో ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్పొరేషన్ నుండి అనుమతులు తీసుకొని పనులు చేపట్టారు. తొలుత బోరు వేసి, ఇంటి నిర్మాణానికి సంబంధించి పునాదులు తీసి, పిల్లర్లు వేశారు. ఈ లోగానే ఆ స్థలంలోకి ప్రవేశించిన కొందరు నిర్మాణ పనులను ధ్వంసం చేశారు. దీంతో అప్పటివరకు నిర్మాణ పనులపై వెచ్చించిన నాలుగు లక్షల రూపాయలను రవీందర్ నష్టపోయారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తు ప్రారంభించిన కరీంనగర్ రూరల్ పోలీసులు సమీపంలోని సిసి కెమెరాలు ఫుటేజ్ ఆధారంగా పొన్నాల కనకయ్య, పవన్, సిరిపురం వెంకటరాజు నిర్మాణాలు కూల్చివేసినట్లు నిర్ధారించారు. దీంతో వారిని ప్రశ్నించగా తోట శ్రీపతిరావు అందుకు పురమాయించినట్లు వారు వెల్లడించారు. ఈ క్రమంలో పోలీసులు 447,427,120 (B)R/W34 సెక్షన్ల కింద శ్రీపతి రావు పై కేసు నమోదు చేశారు. కేసుల విషయం తెలియగానే శ్రీపతిరావు పరారీలో ఉండగా ఆయన కోసం వేటాడిన పోలీసులు చివరకు అంబర్‌పేటలో ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు.

Latest News