ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మొదట్లో కాస్త నిరాశపరచిన ఇప్పుడు తిరిగి పుంజుకుంది. వరుస విజయాలతో దూసుకుపోవడమే కాక వరల్డ్ కప్‌లో సరికొత్త చరిత్రలు కూడా సృష్టిస్తుంది.గత మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో ఆసీస్ వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద విజయం నమోదు చేసింది. ఈ మ్యాచులో ఏకంగా 309 పరుగుల తేడాతో గెలిచి పసికూన నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 399 పరుగులు చేసింది. దీనిని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ 90 పరుగులకే కుప్పకూలడంతో ప్రపంచకప్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయంగా మారింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. గత మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన మిచెల్ మార్ష్ విఫలమయ్యాడు. 9 పరుగులకే విఫలమయ్యాడు. అయితే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (104) వరుసగా రెండో సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక అతనికి జత కలిసిన స్టీవ్ స్మిత్ (71), మార్నస్ లబుషేన్ (62) కూడా వేగంగా ఆడుతూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. ఇక వీరి తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 44 బంతుల్లోనే 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో ప్రపంచకప్ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 399 పరుగులు చేయగా, నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్ 4, బాస్ డి లీడే 2, ఆర్యన్ దత్ ఒక వికెట్ పడగొట్టారు.
నెదర్లాండ్స్ కీలక బౌలర్ బాస్ డీ లీడ్స్‌ను మ్యాక్స్‌వెల్ ఒక ఆట ఆడుకున్నాడు. అతను 10 ఓవర్లలో ఏకంగా 115 పరుగులు ఇచ్చి క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డు తన పేరిట రాసుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. అయితే భారీ లక్ష్యంని చేధించే క్రమంలో నెదర్లాండ్ బ్యాట్స్‌మెన్స్ ఒక్కొక్కరుగా పెవీలియన్‌కి క్యూ కట్టారు. ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ (25) మినహా మిగతా వారెవరు కనీసం 15 పరుగుల మార్కు దాటలేదంటేనే వాళ్లు ఎలా ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఆసీస్ బౌలర్లలో బౌలింగ్ వేసిన ప్రతి ఒక్కరికి వికెట్ దక్కింది. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా అయితే కేవలం మూడు ఓవర్లే వేసి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.