హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులని మెప్పించిన విలక్షణ నటుడు చంద్రమోహన్.వయో భారంవలన గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల గుండెకి సంబంధించి ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే ఆరోగ్యం విషమించడంతో నవంబర్ 11న ఉదయం 9.45 గంటలకు మరణించారు. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. చంద్రమోహన్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ నివాళులు తెలియజేశారు. ఆయన మరణం సినీ పరిశ్రమకి తీరని లోటు అని చెప్పుకొచ్చారు. అయితే చంద్రమోహన్ మరణం తర్వాత ఆయనకి సంబంధించిన అనేక విషయాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
చంద్రమోహన్ 1966లో రంగుల రాట్నం సినిమాతో సినీ రంగప్రవేశం చేసాడు. హీరోగా 170కి పైగా సినిమాలు చేసిన చంద్రమోహన్ నటుడిగా మాత్రం తన కెరీర్‌లో 900కి పైగా చిత్రాల్లో నటించాడు.రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సిరి సిరి మువ్వ, సీతామాలక్ష్మి (1978), రామ్ రాబర్ట్ రహీమ్ (1980), రాధా కళ్యాణం (1981), రెండు రెళ్ళు ఆరు (1986), చందమామ రావే (1987) వంటి సినిమాలు చంద్రమోహన్‌కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.ఆయనకి ఏ పాత్ర ఇచ్చిన కూడా ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోతాడు. తను కమిటైన సినిమా కోసం ఫుల్ ఎఫర్ట్ పెడతాడు. ఈ తరం సినిమాలలో నాన్న క్యారెక్టర్ కోసం ఎక్కువగా చంద్రమోహన్‌ని సంప్రదించేవారు.
చంద్రమోహన్ ఎప్పుడు కూడా నిర్మాతల బాగోగుల గురించే ఆలోచిస్తాడు. తన వలన ఎవరికి నష్టం కలగకూడదని ఎంత కష్టాన్నైన భరిస్తాడు.ఓ సారి ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు చంద్రమోహన్ తల్లి మరణించింది. ఆ రోజు షూటింగ్ లో ఉండగా ఈ విషయం తెలిసిన కూడా చంద్రమోహన్ షూటింగ్ మధ్యలో ఆపేసి వెళ్లకుండా మొత్తం షూటింగ్ పూర్తిచేసి తన తల్లిని చూడటానికి వెళ్లారట. అయితే షూటింగ్ చేస్తున్నప్పడు తన తల్లి మరణించిందని తెలిసిన ఏమాత్రం దుఃఖం కనిపించకుండా చాలా నేచురల్ గా సన్నివేశానికి తగినట్లుగా నటించాడు. అప్పుడు సినిమా పట్ల, ఆయన పని పట్ల అంత నిబద్ధత చూసి అందరు ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని చంద్రమోహన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.