Site icon vidhaatha

ప‌ద్మ‌శ్రీల‌ని ఇంటికి ఆహ్వానించి స‌న్మానం చేసిన ప‌ద్మ విభూషనుడు చిరంజీవి

ప్ర‌తి ఏడాది రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం పద్మ అవార్డుల‌ని ప్ర‌క‌టిస్తున్న విష‌యం తెలిసిందే. వివిధ రంగాల‌లో ప్ర‌తిభ చాటిన వారికి ఈ అవార్డులు ఇస్తుండ‌గా, ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుండి ప‌లువురికి ప‌ద్మ అవార్డులు ద‌క్కాయి. మెగాస్టార్‌ చిరంజీవి, వెంకయ్య నాయుడు లాంటి సెలబ్రిటీలకు పద్మవిభూషణ్ పురస్కారాలకు ఎంపికవ్వగా… అలాగే చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు, శిల్పి ఆనందాచారి వేలు కు పద్మశ్రీ అవార్డు ద‌క్కింది. కొద్ది రోజుల క్రితం చిరంజీవి.. వెంక‌య్య నాయుడు ఇంటికి వెళ్లి ఆయ‌న‌ని స‌న్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఇప్పుడు ప‌ద్మ అవార్డ్ ద‌క్కించుకున్న గడ్డం సమ్మయ్యతో పాటు ఆనందాచారిని త‌న ఇంటికి పిలిపించి ఘనంగా సత్కరించారు మెగాస్టార్ . ఇద్దరికి ప్రత్యేకంగా చిరంజీవి శాలువా కప్పి సన్మానం చేశారు. అలాగే చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చినందుకు ఆయన్ను కూడా ఇద్దరు సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సమ్మయ్యకు, ఆనందాచారికి పద్మ శ్రీ రావడం చాలా సంతోషంగా ఉంద‌ని తెలిపారు. అంతరించిపోతున్న చిందు యక్షగాన కళారూపానికి జీవం పోస్తున్న గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. యాదాద్రిలో అద్భుతం సృష్టంచిన ఆనందాచారిలాంటి వారిని కూడా ఇలా సత్కరించుకోవడం తన అదృష్టం అని చిరంజీవి తెలియ‌జేశారు.

ఇలాంటి కళారూపాలను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. కళలను, కళాకారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడుకోవాలని’ అని చిరంజీవి అన్నారు. ఇక చిరంజీవి లాంటి న‌టుడు త‌మని స‌న్మానించ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని ఆనందాచారి అన్నారు. యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య 50 ఏళ్లుగా యక్షగాన కళాకారుడిగా 19వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.ఇక డాక్టర్ ఆనందాచారి యాదాద్రి ఆలయాన్నిపునర్నిర్మాణం చేయడంలో ప్రముఖంగా వ్వవహరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శిల్ప కళాశాలలో తొలిదశలో శిక్షణ పొంది, ప్రప్రథమంగా ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లోని దేవాదాయ శాఖకు చెందిన స్థపతి హోదాలో పనిచేశారు. 

Exit mobile version