ఈ భూమ్మీద చాలా మంది భక్తులు ఉన్నారు. ప్రతి భక్తుడు తమకు ఇష్టమైన దేవుడికి పూజలు చేస్తూ మొక్కులు సమర్పించుకుంటారు. ఒక్కో రోజు ఒక్కో దేవుడిని కొలుస్తారు. సోమవారం శివుడిని, మంగళవారం ఆంజనేయుడిని, బుధవారం అయ్యప్పను, గురువారం సాయిబాబాను, శుక్రవారం లక్ష్మీదేవిని, శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజిస్తుంటారు. అయితే హనుమంతుడికి మాత్రం మంగళవారమే ఎందుకు ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారానికి మారుతికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసుకుందాం..
రామ భక్తుడైన హనుమంతుడికి సనాతన ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది. ఆంజనేయుడిని ఆరాధిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం. కోరుకున్న కోరికలు కూడా హనుమంతుడు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. మంగళవారం నాడు ఆంజనేయుడిని పూజిస్తే.. స్వామి వారి ఆశీర్వాదం, అనుగ్రహం లభిస్తాయని పండితులు చెబుతుంటారు. అంతేకాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు హనుమంతుడిని ఆరాధిస్తే వాయువేగంతో అక్కడ వాలిపోయి, భక్తులకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం.
మరి మంగళవారమే ఎందుకు పూజించాలంటే..
చైత్ర మాసం మొదటి రోజున కేసరి, అంజన దంపతులకు హనుమాన్ జన్మించాడు. ఆ రోజు మంగళవారం. దీంతో భక్తులు ఆంజనేయ స్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మంగళవారం నాడు పవన పుత్రుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతుంటారు. శ్రీరాముని పట్ల విధేయత, భక్తికి పేరుగాంచిన మారుతి, బలం జ్ఞానానికి కూడా ప్రసిద్ధి. అవన్నీ తమకూ సిద్ధిస్తాయని భక్తులు భావిస్తారు.
ఇక రామాయణానికి మంగళవారానికి కూడా సంబంధం ఉంది. సీతను రావణుడు అపహరించి లంకలో దాచిపెట్టగా, హనుమంతుడు ఆమె జాడ కోసం వెతికి లంకలో ఉన్నట్టు గుర్తించిన రోజు మంగళవారం అని పండితులు చెబుతుంటారు. సీత జాడ కోసం వెతికిన సందర్భం హనుమాన్ వీరోచిత ధైర్యాన్ని ప్రదర్శిస్తుందని చెబుతారు. దీంతో మంగళవారం నాడు భక్తులు హనుమాన్ దేవాలయాలను సందర్శిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు.