Site icon vidhaatha

గొప్ప మాన‌వ‌తావాదిని కోల్పోయాం.. మోదీ, చిరంజీవి, ఎన్టీఆర్‌తో పాటు ప్ర‌ముఖుల సంతాపం

కెప్టెన్ విజ‌య్ కాంత్ గ‌త కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఈ రోజు క‌న్ను మూసారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డిన విజ‌య్ కాంత్ కొద్ది రోజులుగా వీల్ చైర్‌కే ప‌రిమితం అయ్యారు. కొన్ని నెల‌ల క్రితం ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డంతో చాలా రోజుల పాటు ఆసుపత్రికే ప‌రిమితం అయ్యారు. ఇక కోలుకొని తిరిగి ఇంటికి వెళ్లిన విజ‌య్ కాంత్‌కి అంతలోనే కరోనా సోకి మృతి చెందడం తీవ్ర విషాదంగా మారింది. విజయ్‌కాంత్ 80, 90 దశకాల్లో వందలాది చిత్రాల్లో నటించి అలరించారు. ఆ తర్వాత డీఎండీకే పార్టీని స్థాపించి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్‌కాంత్ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే నాయకుడు అంటూ మంచి గుర్తింపు ఉంది.

విజ‌య్ కాంత్ మ‌ర‌ణ వార్త‌ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు.విజయ్‌కాంత్ మ‌ర‌ణ వార్త‌తో ఇటు సినిమా రంగంతో పాటు.. అటు రాజకీయాల‌కి చెందిన వారు కూడా స్పందించారు. ప్రధాని మోదీ, చిరంజీవి, కమల్ హాసన్, శరత్ కుమార్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, నారా లోకేష్, మంచు విష్ణు, సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. విజ‌య్ కాంత్‌కి ఇటు సినిమా అటు రాజకీయ రంగాలకు సంబంధించి అనేకమంది ప్రముఖులతో మంచి అనుబంధం ఉండ‌గా, ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ని ఎవ‌రు త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప‌లువురు ప్రార్ధిస్తున్నారు.

నా ప్రియతమ సోదరుడు, నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రావిడ సంఘం వ్యవస్థాపకుడు, విలక్షణ నటుడు, తమిళ సినీ సారథి విజయకాంత్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని కమల్ హాసన్ అన్నారు. ఏదో ఒక రోజు కోలుకుని మళ్లీ కెప్టెన్ యాక్టివ్ అవుతాడని ఆశించాం. కాని మ‌ర‌ణం అభిమానులను షాక్‌కి గురి చేసింది అని శ‌ర‌త్ కుమార్ అన్నారు. 1952 ఆగస్టు 25న జన్మించిన విజయ్ కాంత్.. సినీ, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారు. ఆయన 150 పైగా సినిమాల్లో నటించగా.. 20కి పైగా సినిమాల్లో పోలీస్ పాత్రలో మెరిశారు.రేపు విజయకాంత్ భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.40 సంవత్సరాలకు పైగానే సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న విజయ్‌కాంత్ DMDK (దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం) స్ధాపించి రాజకీయాల్లో తనదైన ముద్రను వేసారు. 71 ఏళ్ల వయసులో చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

Exit mobile version