బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఇటీవలి కాలంలో చాలా హైప్ తెచ్చుకుంది. అన్ని ప్రాంతీయ భాషలలో ఈ షో సత్తా తెగ సత్తా చాటుతుంది. తెలుగులో ఈ కార్యక్రమం ఏడు సీజన్స్‌తో పాటు ఒక ఓటీటీ వర్షెన్ జరుపుకుంది. మరో ఓటీటీ వర్షెన్ ఉంటుంది అని ప్రచారం జరుగుతున్నా కూడా దానిపై క్లారిటీ లేదు. మరోవైపు ఇటీవల హిందీలో బిగ్ బాస్ సీజన్ 17 కూడా ముగిసింది. మొత్తానికి బిగ్ బాస్ షో మాత్రం బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతుంది అని చెప్పాలి. అయితే బిగ్ బాస్ షోకి వెళుతున్నామంటే ఫోన్స్, రిలేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టి 110 రోజులు హౌజ్‌లో సిన్సియర్‌గా గేమ్ ఆడాల్సి ఉంటుంది.
బయట ప్రపంచంతో సంబంధం లేకుండా లోపల ఉన్నవాళ్లతోనే గేమ్ ఆడుతూ అందులో గెలిచే ప్రయత్నం చేస్తుంటారు. ఈ సమయంలో కొందరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడి ప్రేమలో మునిగి తేలుతుంటారు. బయటకు వచ్చాక పెళ్లి కూడా చేసుకుంటారు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ భర్త ప్రేమగా తన భార్యని హౌజ్ లోకి పంపి అతడు వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడట. బిగ్ బాస్ తన కాపురం కూల్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్. ఆమె పేరు ఆర్య. మలయాళ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ సీరియల్స్‌తో పాటు సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే మలయాళ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. అయితే ఆ షో నుంచి తిరిగి వచ్చే సరికి తన భర్త తనను వదిలేశాడని పేర్కొంది.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి తెలిపింది. నేను బిగ్ బాస్ షోలోకి వెళ్లడానికి నా భర్త మద్దతు చాలా ఉంది. నాకు కూతురు ఉంది. అయితే బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన సమయంలో నాన్న చనిపోయారు. అప్పుడు కొంత డిప్రెషన్ లో ఉండగా, బిగ్‌బాస్ వెళ్లమని ఆయనే నాకు సపోర్టు చేసి మరీ ఎయిర్‌పోర్టులో దింపారు. చాలా రోజుల తర్వాత నేను బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చే సరికి అడ్రెస్ లేడు.ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నా సోదరికి ఫోన్ చేస్తే అతడు వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని.. ఆ సమయంలో అతను దుబాయ్ లో ఉన్నాడని తెలిసింది. కోవిడ్ సమయంలో అక్కడికి వెళ్లలేకపోయాను. అతడిని చంపాలన్న కోపం నాకు ఉంది. తగిన శాస్తి జరిగితే నేను చాలా సంతోషిస్తానంటూ ఆర్య పేర్కొంది.