Site icon vidhaatha

ఈ రోజు థియేట‌ర్స్‌లో ఏకంగా ప‌ది సినిమాలు విడుద‌ల‌..ప్రేక్ష‌కుల‌కి పండ‌గే..!

శుక్ర‌వారం వ‌చ్చిందంటే థియేటర్స్ ద‌గ్గ‌ర సంద‌డి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌తివారం కూడా ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి కొత్త సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి. గతవారం రెండు సినిమాలు థియేటర్లలోకి రాగా, ఇవి రెండు ఓ మోస్త‌రు విజ‌యం అందుకున్నాయి. గురువారం ‘హాయ్ నాన్న’ సినిమా విడుదల కాగా.. శుక్రవారం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్’ రిలీజ్ అయ్యాయి. అయితే డిసెంబ‌ర్ 22న ప్ర‌భాస్ రిలీజ్ అవుతుండ‌డంతో చిన్న సినిమాల‌న్నీ కూడా ఈ రోజు థియేట‌ర్స్‌కి క్యూ క‌ట్టాయి. ఏకంగా పది సినిమాలు ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చేస్తున్నాయి. అవేంట‌నేది చూస్తే.. ముందుగా  పిండం.. ‘రోజాపూలు’ సినిమాతో పాపులర్ అయిన హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ద్వారా సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.. ఇది పూర్తిస్థాయి హారర్ మూవీ.

జోరుగా హుషారుగా అనే చిత్రం కూడా నేడే విడుద‌ల అవుతుంది. విరాజ్ అశ్విన్ హీరోగా పూజిత పొన్నాడ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి అను ప్రసాద్ ద‌ర్శకుడు. యూత్‌ఫుల్, ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందింది. నేడు విడుద‌ల అవుతున్న మ‌రో చిత్రం దళారి. రాజీవ్ కనకాల, షకలక శంకర్, శ్రీతేజ్, అక్సాఖాన్, రూపిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి కాచిడి గోపాల్‌రెడ్డి రచన, దర్శకత్వం అందించారు. నేటి సమాజంలో సమస్యలను తమ చిత్ర కథగా చూపించామన్నారు. ఇక బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కలశ’ కూడా నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.. కొండా రాంబాబు దర్శకత్వం వహించారు. తికమకతాండ అనే చిత్రం కూడా నేడు ప‌ల‌క‌రించ‌నుండ‌గా, ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో కవలలు రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా నటించారు. ‘రాజన్న’ సినిమాతో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న యాని ఈ సినిమాలో ఒక హీరోయిన్. రేఖా నిరోష మరో కథానాయిక. వెంకట్ దర్శకత్వం వహించారు.

శాంతల చిత్రం ఈ రోజు విడుద‌ల కానుండ‌గా, ‘ది ఫ్యామిలీ మేన్’ ఫేమ్ అశ్లేష ఠాకూర్, నిహాల్ జంటగా శేషు పెద్దిరెడ్డి దర్శకత్వంలో పీరియాడిక‌ల్ మూవీగా రూపొందింది. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం ‘చే’ కూడా నేడు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నరేష్ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి కాండ్రేగుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ మాయలో’ అనే చిత్రం కూడా ఈ రోజే విడుద‌ల కానుంది. ఇది ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ అని చిత్ర యూనిట్ చెబుతోంది. సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి కుమారుడు వైభవ్ హీరోగా నటించిన సినిమా ‘ఆలంబన’ నేడు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది . సఖి అనే చిత్రం కూడా ఈ రోజు విడుద‌ల కానుండ‌గా, ఇందులో లోకేష్ ముత్తుమల, దీపికా వేమిరెడ్డి, దివ్య, పల్లవి, సాహితీ చిల్ల, సందీప పసుపులేటి, సుధాకర్ రెడ్డి, జ్యోతి స్వరూప్, జితిన్ ఆదిత్య ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటకు జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

Exit mobile version