ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుంది. ఆర్‌కె బీచ్ లో ఐదు రోజుల పాటు కీలక షెడ్యూల్ ప్లాన్ చేయగా, అక్కడ పెద్ద పొలిటికల్ మీటింగ్ సెట్ ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాని పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా శంకర్ తనదైన శైలిలో రూపొందిస్తున్నారు.అయితే ఈ సినిమా మొదలై చాలా రోజులే అవుతున్నా కూడా చిత్ర బృందం నుండి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. కాని లీకులు మాత్రం బాగానే వస్తున్నాయి.
వైజాగ్ లొకేషన్ నుండి కూడా రామ్ చరణ్ ఫొటోస్ లీక్ అయ్యాయి. చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ నందన్ అనే ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. శ్రీకాంత్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర ముగ్గురు విలన్ లు గా నటిస్తున్నట్టు ఓ టాక్ వినిపిస్తుంది. ఇక చెర్రీ ఈ చిత్రంలో తండ్రి, కొడుకులుగా డ్యూయల్ రోల్ పోషించనున్నాడని సమాచారం. తాజాగా చిత్రానికి సంబంధించిన మేటర్ లీక్ కాగా, ఇందులో రామ్ నందన్ తండ్రి పేద ప్రజల బాగు కోసం ఒక పార్టీని స్థాపిస్తారు. అయితే అతనికి స్నేహితుడిగా ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తి వెన్ను పోటు పొడిచి పార్టీని లాక్కుంటాడు. శ్రీకాంత్ తనయుడిగా ఎస్ జె సూర్య నటిస్తుండగా, సూర్య తండ్రిని మించిన రాజకీయ స్వార్థపరుడిగా కనిపిస్తాడట.
అంతేకాదు సూర్య అధికారం దక్కించుకునేందుకు క్రూరమైన ఎత్తుగడలు వేసి ప్రజలని నానా ఇబ్బందులకి గురి చేస్తుండాట. అతని ఆలోచనలని నవీన్ చంద్ర అమలు చేస్తుంటాడని, సూర్య తమ్ముడి పాత్రలో నవీన్ చంద్ర కనిపించనున్నాడని సమాచారం. అయితే రామ్ నందన్ తండ్రిలా పొలిటికల్ లీడర్ కాకుండా ఐఏఎస్ ఎందుకు అయ్యాడు, స్వార్థ పరుల నుండి తన తండ్రి పార్టీని రక్షించాడా వంటి అంశాలతో శంకర్ సినిమాని రూపొందించినట్టు సమాచారం. స్క్రీన్ ప్లే మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని, యాక్షన్ ఎపిసోడ్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయని అంటున్నారు. చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, అంజలి, జయరాం, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లేదా డిసెంబర్ లో మూవీని రిలీజ్ చేసే అవకాశం ఉంది.