మహేంద్ర సింగ్ ధోని తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు విరాట్ కోహ్లి. వన్డే, టీ20, టెస్ట్ మ్యాచ్‌లకి కెప్టెన్‌గా ఉన్న విరాట్ ఉన్నట్టుండి కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అయితే కోహ్లీ ఇలా తప్పుకోవడం వెనక సౌరవ్ గంగూలీ హస్తం ఉందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా దీనిపై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ గంగూలీ స్పందించాడు. కోహ్లీ టీ20 కెప్టెన్సీని వదులుకుంటానంటే.. వన్డే కెప్టెన్సీ కూడా వదిలేయాలని మాత్రమే నేను సూచించాను. ఇది కోహ్లీ మంచి కోరి చెప్పాను అని గంగూలీ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2021 ఘోర పరాజయం తర్వాత విరాట్ కోహ్లీ టీం కెప్టెన్సీకి గుడ్ బై చెప్పగా, అతను వన్డే ఫార్మాట్‌తో పాటు టెస్ట్ క్రికెట్‌లో సారథిగా కొనసాగాలనుకున్నాడు.
అయితే కోహ్లీని వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పించారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారని విరాట్ కోహ్లీ మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే కోహ్లీకి చెప్పే ఈ నిర్ణయం తీసుకున్నామని గంగూలీ చెప్పగా, దానిని కోహ్లీ ఖండించాడు. తమ నిర్ణయం ప్రకటించేముందుకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారని అన్నాడు. అయితే వన్డే కెప్టెన్సీ తప్పించడం పట్ల అవమానంగా భావించిన కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీని కూడా వదిలేసాడు. అప్పటి నుండి విరాట్ కోహ్లీ- గంగూలీ మధ్య రైవల్రీ నడుస్తుంది.
మరోవైపు కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించిన విధానాన్ని తప్పుబట్టిన బీసీసీఐ ఆఫీస్ బేరర్లు.. గంగూలీని మరోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగకుండా అడ్డుకున్నారు. ఐసీసీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలున్నా.. మద్దతు ఇవ్వకపోవడంతో అతను బీసీసీఐని వీడాల్సి వచ్చింది. అయితే దాదా రీసెంట్‌గా దాదాగిరి అన్‌లిమిటేడ్ సీజన్ 10 అనే రియాల్టీ షోలో పాల్గొనగా, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఎపిసోడ్ గురించి ఆయనని ప్రశ్నించారు. దానికి సమాధానం ఇచ్చిన గంగూలీ.. అతనిని కెప్టెన్సీ నుండి తప్పించలేదు. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించాడు. అప్పుడు నేను టీ20ల్లో కెప్టెన్‌గా కొనసాగలేనప్పుడు.. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకోవాలని నేను సూచించాను. కేవలం టెస్ట్‌ల్లో మాత్రమే సారథ్యం చేయమని చెప్పాను. అతని మంచి కోరే ఈ సలహా ఇచ్చాను అని గంగూలి స్పష్టం చేశాడు.