వన్డే వరల్డ్ కప్ 2023లో భారత జట్టు దూసుకుపోతుంది. సెమీస్ వరకు ఒక్క ఓటమి కూడా చవి చూడకుండా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఫైనల్‌లో కూడా అందరు సమిష్టిగా ఆడి కప్ గెలవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే టీమిండియానే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్ అని అందరూ అంటున్నప్పటికీ ఎక్కడో ఓ మూలన కాస్త టెన్షన్ ఉంది. ఇదే సమయంలో ఐసీసీ ఈ మ్యాచ్ అఫీషియల్స్ జాబితాను విడుదల చేయగా, ఇది చూసాక మరింత టెన్షన్ పెరిగింది. అందుకు కారణం ఫైనల్ మ్యాచ్‌కి ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా రిచర్డ్ కెటిల్‌బరో ఉన్నాడు. టీమిండియా నాకౌట్స్ చేరిన మ్యాచుల్లో అతను అంపైర్‌గా ఉన్న ప్రతిసారీ భారత్ ఓటమి చవి చూసింది. ఈ ఫైనల్‌కి కూడా అతనే అంపైర్‌గా ఉండనుండడంతో పాత సెంటిమెంట్ ఏమైన ప్రభావం చూపిస్తుందా అని టెన్షన్ పడుతున్నారు.
నవంబరు 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఇద్దరూ ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నట్టు ఐసీసీ తెలియజేసింది. మ్యాచ్ అంపైర్‌గా ఆండీ పైక్రాఫ్ట్ , మూడో అంపైర్‌గా జోల్ విల్సన్ ఉండగా.. ఫోర్త్ అంపైర్‌గా క్రిస్ గాఫనీ ఉండనున్నట్టు ఐసీసీ తెలిపింది. అయితే కెటిల్‌బరో పేరు వినగానే అభిమానులలో భయం పెరిగిపోయింది. 2013 తర్వాత భారత జట్టు నాకౌట్స్‌లో ఓడిన మ్యాచుల్లో అత్యధిక భాగం ఓటముల్లో కెటిల్ బరో భాగం కూడా ఉందని అంటున్నారు. 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోగా, ఆ మ్యాచ్‌కి కెటిల్‌బరో, ఇయాన్ గోల్డ్ అంపైర్లుగా ఉన్నారు.
ఇక 2015 వన్డే వరల్డ్ కప్‌లో ఆసీస్‌తో జరిగిన సెమీస్ మ్యాచులో భారత్ ఓడిపోగా, ఆ మ్యాచులో కెటిల్‌బరో, కుమార ధర్మసేన అంపైర్లుగా ఉన్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోయినప్పుడు కెటిల్‌బరో, మరాస్ ఎరాస్మస్ అంపైరింగ్ చేశారు. అనంతరం 2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిల్యాండ్ చేతిలో భారత్ ఓడినప్పుడు కెటిల్‌బరోనే అంపైర్ గా ఉన్నారు. అతనితోపాటు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆ మ్యాచ్‌లో ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఫైనల్‌కు మళ్లీ వాళ్లిద్దరే అంపైర్లు అనగానే ఫ్యాన్స్ పాత సెంటిమెంట్ భారత్‌పై ప్రభావం చూపిస్తుందా అని టెన్షన్ పడుతున్నారు. చూడాలి మరి రేపటి మ్యాచ్‌లో మనోళ్లు ఏం చేస్తారనేది..!