హిందూ ధర్మంలో భక్తులు తమకు ఇష్టమైన దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మంగళవారం వచ్చిందంటే చాలు హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. హనుమాన్ చాలీసాతో మార్మోగిపోతుంటాయి. ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన మంగళవారం నాడు తమలపాకులతో పూజించి, వడమాల సమర్పిస్తే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని పండితులు చెబుతుంటారు. అసలు హనుమాన్‌కు తమలపాకులకు ఉన్న అనుబంధం ఏంటో తెలుసుకుందాం.
రావణుడు సీతను అపహరించిన తర్వాత ఆమె జాడను తెలుసుకునేందుకు లంకకు హనుమంతుడు వెళ్తాడు. జాడ తెలుసుకున్న తర్వాత శ్రీరాముడి వద్దకు ఆంజనేయుడు తిరిగి వస్తుండగా.. వానరులు అందరూ ఎదురుచూస్తుంటారు. ఇక ఆంజనేయుడికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఆ వనంలోని ఆకులు, పూలు.. ముఖ్యంగా తమలపాకులను మెడలో వేసి స్వాగతం పలికినట్లు పండితులు చెబుతుంటారు. దీంతో ఆంజనేయుడికి తమలపాకులు అంటే ఎంతో ప్రీతి అని చెబుతారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఆంజనేయస్వామి సహజంగా ఉగ్రస్వరూపుడు. తమలపాకుల దండ స్వామికి అలంకరించడం వల్ల స్వామి ఉగ్రస్వరూపం వీడి శాంత స్వరూపంతో భక్తులను అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. అందుకే హనుమను తమలపాకులతో పూజించడం వలన సకల అభీష్ఠాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతుంటారు.
మరి వడమాల వెనకున్న కథేంటి..?
చాలా మంది భక్తులు హనుమంతుడికి వడమాల సమర్పించి, మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఈ వడమాల వెనుకున్న కథేంటంటే.. ఆంజనేయుడు ఒకసారి రావణుడి నుంచి శని దేవుడిని రక్షించాడట. దీంతో శని దేవుడు ఆంజనేయస్వామిని ఆశీర్వదించి, హనుమంతుడిని పూజించిన వారికి శని బాధలు ఉండవని ఒక వరం ఇస్తాడట. అయితే శనిదేవునికి ప్రీతిపాత్రమైన మినుములతో తయారు చేసిన వడలను మాలగా చేసి హనుమకు సమర్పించినట్లైతే శని భగవానుని అనుగ్రహం పొంది, పీడించే శని బాధల నుంచి ఉపశమనం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.