ప్రస్తుతం ఇండియా- ఇంగ్లండ్ మధ్య హైదరాబాద్ వేదికగా తొలి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు ఆటలో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలింగ్‌లో తిప్పేసిన భారత్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఇంగ్లండ్‌కు బజ్‌బాల్ రుచి చూపించి కంగుతినిపించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ పేసర్లని సమర్ధంగానే ఎదుర్కొన్నారు. ఆ తర్వాత స్పిన్నర్లు రంగ ప్రవేశం చేయడంతో ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకు కుప్పకూలింది. ఇక తొలిరోజు ముగిసే సరికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 76 పరుగులతో, శుభ్‌మన్ గిల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఉండగా, రోహిత్ అనవసర షాట్‌కి ప్రయత్నించి 24 పరుగులకి ఔటయ్యాడు.
అయితే భారత స్పిన్నర్లు చెలరేగిన ఉప్పల్ పిచ్‌పై ఇంగ్లండ్ స్పిన్నర్లు దారుణంగా విఫలం కావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్ కంటే 127 పరుగులు వెనుకంజలో నిలిచింది. అయితే యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇంగ్లండ్ పేసర్లు, స్పిన్నర్లని ఓ ఆట ఆడుకున్నారు. టీ20 తరహాలో దూకుడుగా ఆడిన జైస్వాల్.. భారీ సిక్సర్లతో ఇంగ్లండ్ స్పిన్నర్లపై విరుచుకుపడడంతో వారు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఇక భారత గడ్డపై ఆడిన అనుభవం ఎక్కువ లేకపోవడం.. తగినంత ప్రాక్టీస్ లేకుండా నేరుగా మ్యాచ్ బరిలోకి దిగడం కూడా ఇంగ్లండ్‌కి ఇబ్బందిగా మారింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పుంజుకోవాలంటే స్పిన్నర్లు నిలకడగా బౌలింగ్ చేయాల్సి ఉంది. అయితే జో రూట్ బాల్‌తో కూడా అద్భుతాలు చేయగలడు. మరి అతనికి తొలి రోజు బౌలింగ్ చేయించలేదు. మరి రెండో రోజు అతనికి బాల్ ఇచ్చి ఏమైన అద్భుతాలు చేయిస్తారా చూడాలి.
ఇంగ్లండ్ జట్టు 55/0తో మెరుగైన స్థితిలో ఉన్న సమయంలో రోహిత్ బంతిని స్పిన్నర్స్‌కి ఇవ్వడంతో కథ పూర్తిగా మారింది. కాసేపటికే 60/3కి చేరుకుంది. అయిదు పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 108/3తో లంచ్ విరామానికి వెళ్లారు. కానీ రెండో సెషన్ ఆరంభంలోనే భారత్ స్పిన్నర్లు వరుస వికెట్స్ తీయడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. మ్యాచ్‌కి ముందు బజ్ బాల్‌తో ఇండియాకి ముచ్చెమటలు పట్టిస్తామని ఇంగ్లీష్ వాళ్లు ప్రగల్భాలు పలకడంతో ఇప్పుడు వారికి దిమ్మ తిరిగే పంచ్‌లు ఇస్తున్నారు నెటిజన్స్. భారత్‌లో బజ్‌బాల్ కుదరదని, వేరే ఎక్కడన్నా ఆడుకోమని పోస్టులు పెడుతున్నారు. ‘మీది బజ్‌బాల్ అయితే, మాది స్పిన్ బాల్’ అని కామెంట్లు చేస్తున్నారు.ఇంకొందరైతే ‘వైట్ బాల్, రెడ్ బాల్ ఉంది.. మీ బజ్ బాల్ ఎక్కడా?’ అని నినాదాలు చేస్తున్నారు.