Site icon vidhaatha

నేడు ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌.. జ‌ట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయంటే..!

ఇంగ్లండ్‌తో భార‌త్ ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే రెండు టెస్ట్‌లు పూర్తి కాగా, ఇందులో ఇంగ్లండ్ ఒక‌టి, భార‌త్ ఒక‌టి గెలిచి సిరీస్ స‌మం చేశాయి. ఇక నేటి నుండి మూడో టెస్ట్ జ‌ర‌గ‌నుంది. రాజ్‌కోట్ వేదికగా గురువారం ఉదయం 9.30 గంటల‌కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుండ‌గా, భార‌త జ‌ట్టు గాయ‌లు, ఆట‌గాళ్ల గైర్హాజ‌రితో స‌త‌మ‌తం అవుతుంది. భార‌త ఆట‌గాళ్లు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. విరాట్ కోహ్లీ ప‌ర్స‌న‌ల్ రీజ‌న్స్ వ‌ల‌న టెస్ట్ సిరీస్ కి దూర‌మ‌య్యాడు. దీంతో కుర్రాళ్ల‌తోనే ఇంగ్లండ్‌ని ఢీకొట్టేందుకు రోహిత్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడు.

తొలి రెండు టెస్ట్‌ల‌లో పెద్ద‌గా రాణించ‌ని వారిని కూడా ఈ మూడో టెస్ట్‌లో ప‌క్క‌న పెట్టే అవ‌కాశం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో జడేజా గాయపడ‌డంతో అత‌ను విశాఖపట్నంలో జరిగిన సిరీస్‌కి పూర్తిగా దూరం అయ్యాడు. అయితే మూడో టెస్ట్‌కి జ‌డేజా త‌ప్ప‌క అందుబాటులో ఉంటాడ‌ని తెలుస్తుంది. జడేజా పునరాగమనంతో స్పిన్న‌ర్స్‌లో రవిచంద్రన్‌ అశ్విన్ తో పాటుగా కుల్‌దీప్‌ యాదవ్‌ లేదా అక్షర్‌ పటేల్‌లో ఒకరు జ‌ట్టుకు ఆడే అవ‌కాశం ఉంది. జడేజా పున‌రాగ‌మ‌నం చేయ‌డం బార‌త్‌కి కాస్త క‌లిసొచ్చే అంశంగా చెప్ప‌వ‌చ్చు.

ఇక విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ వేలికి గాయం కావ‌డంతో అత‌ను మైదానంలోకి కూడా దిగ‌లేదు. మంగ‌ళ‌వారం ప్రాక్టీస్ కూడా చేయ‌లేదు. అయితే గిల్ గాయం పెద్ద‌ది కాదు అని తెలుస్తుండ‌గా అత‌ను మూడో టెస్ట్ ఆడే అవ‌కాశం చాలా ఉందని అంటున్నారు. అయితే శ్రేయాస్ అయ్యర్ గైర్హాజ‌రుతో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. టాప్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ తర్వాత భారత జట్టు మిడిలార్డర్‌లో సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, వికెట్ కీపర్ ధృవ్ జురెల్ బ్యాటింగ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కేఎస్ భ‌ర‌త్ తొలి రెండు టెస్ట్‌ల‌లో దారుణంగా నిరాశ ప‌ర‌చ‌డంతో జురెల్‌కి మూడో టెస్ట్ అవ‌కాశం ఇచ్చిన‌ట్టుగా చెబుతున్నారు. ఫాస్ట్ బౌలర్‌గా, భారత జట్టు జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్‌పై ఆధారపడవచ్చు. రెండో టెస్ట్‌లో ఆడిన ముకేష్ పెద్ద‌గా ప్ర‌ద‌ర్శ‌న చేయ‌క‌పోవ‌డంతో అత‌నికి మొండి చేయి చూపించే అవ‌కాశం లేక‌పోలేదు. 

Exit mobile version