Rishabh Pant | ఐపీఎల్‌లో రీ ఇంట్రీ ఇవ్వనున్న రిషబ్‌ పంత్‌.. ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ మేనేజ్‌మెంట్‌..!

  • Publish Date - March 20, 2024 / 04:17 AM IST

Rishabh Pant | భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ త్వరలో మైదానంలోకి బరిలోకి దిగనున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)-2024 సీజన్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా కనిపించనున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ మంగళవారం రాత్రి ప్రకటించింది. గత ఏడాది జరిగిన కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ గత ఐపీఎల్ సీజన్‌లో ఆడలేకపోయాడు. అతని స్థానంలో డేవిడ్‌ వార్నర్‌ ఢిల్లీ టీమ్‌కు సారథ్యం వహించాడు. రిషబ్‌ పంత్‌ 15 నెలల తర్వాత తిరిగి మైదానంలోకి రెడీ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని పార్త్‌ జిందాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘పంత్‌ను మరోసారి మా కెప్టెన్‌గా స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ధైర్యసాహసాలు, నిర్భయత అతని క్రికెట్ బ్రాండ్‌ని నిర్వచించాయి. అతని కోసం వేచి ఉండలేను. కొత్త ఉత్సాహం, స్ఫూర్తితో కొత్త సీజన్లోకి అడుగుపెడతాం’ అన్నారు.

ఇదిలా ఉండగా.. డిసెంబర్‌ 30, 2022న ఢిల్లీ నుంచి ఇంటికి వెళ్తుండగా రిషబ్‌ పంత్‌ కారు ప్రమాదానికి గురైంది. తీవ్రమైన గాయాలు కావడంతో చికిత్స కోసం ముంబయికి తరలించారు. కోలుకున్న తర్వాత చాలా కాలం పాటు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో పునరావాసంలో ఉన్నాడు. ఎంతో శ్రమించి ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసయ్యాడు. ఇటీవల, బీసీసీఐ వైద్య బృందం ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించింది. దాంతో పంత్ తిరిగి మైదానంలోకి రావడం ఖాయమైంది. ఐపీఎల్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ శిక్షణా శిబిరం కోసం ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ పంత్ విశాఖపట్నంలోనే ఉన్నాడు. ఢిల్లీ మొదటి మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌తో మార్చి 23న ఆడనుంది. ఈ టోర్నీలో పంత్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఆడనుండడం ఢిల్లీ అభిమానులకు ఊరటనిచ్చే విషయమే. ఢిల్లీ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ కూడా పంత్ రీ ఎంట్రీపై సంతోషం వ్యక్తం చేశాడు. నెట్స్‌లో ప్రాక్టీస్‌ను చూసి ఆనందం వ్యక్తం చేసిన పాంటింగ్‌.. గతేడాది పంత్‌ను చాలా మిస్సయ్యామని చెప్పాడు.

Latest News