Site icon vidhaatha

ఆ ఒక్క‌టి తప్ప ఈ ఏడాది కోహ్లీకి అంతా మంచే జ‌రిగింది..ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీకి బ్యాడ్ టైం న‌డిచింది. ప‌రుగులు రావ‌డం చాలా క‌ష్టంగా మార‌డంతో అత‌నిని టీమ్ నుండి తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. అప్ప‌టికే కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన కోహ్లీని ఆట‌గాడిగాను తీసేయాల‌ని ఫ్యాన్స్ కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాని అన్ని అవ‌మానాల‌ని ఓపిక‌గా భ‌రిస్తూ వ‌చ్చిన కోహ్లీ తిరిగి త‌న స‌త్తా ఏంటో చూపించాడు. ఈ ఏడాది అద‌ర‌గొట్టాడు. ఐసీసీ టైటిల్ గెలవలేదన్న లోటు మినహా బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ అనేక రికార్డులు క్రియేట్ చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023లో అసాధారణ బ్యాటింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా కూడా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో కోహ్లీ ఈ ఏడాది టీ 20ల‌కి చాలా దూరంగా ఉన్నాడు. వ‌న్డేలు, టెస్ట్‌లు మాత్ర‌మే ఆడుతూ వ‌చ్చాడు.

వ‌న్డే, టెస్ట్‌ల‌లో కోహ్లీ మొత్తంగా 34 ఇన్నింగ్స్‌లు ఆడ‌గా, అత‌నికి 66.68 సగటుతో1934 రన్స్ చేశాడు. ఇందులో 8 సెంచరీలు.. 9 హాఫ్ సెంచరీలున్నాయి. ఒక్క వన్డే ఫార్మాట్‌లోనే 24 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ..72.47 సగటుతో 1377 పరుగులు చేయ‌డం విశేషం. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలతో పాటు 8 అర్థశతకాలు ఉన్నాయి. శ్రీలంక, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లోను అలానే ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కోహ్లీ దుమ్ము రేపాడు. ఐపీఎల్‌ 2023 సీజన్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. జట్టును ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయినా.. 14 ఇన్నింగ్స్‌ల్లో మాత్రం 639 పరుగులు చేసి ప‌రుగుల దాహాన్ని తీర్చుకున్నాడు.

అయితే ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోవ‌డం టీమిండియా ఓడిపోవ‌డం మ‌నం చూశాం. రెండు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ 14, 49 పరుగులతో విఫ‌లం అయ్యాడు. ఆసియా క‌ప్‌లో బ్యాటింగ్ చేసే ఎక్కువ అవ‌కాశం రాని కోహ్లీకి ప్ర‌పంచ క‌ప్‌లో మాత్రం త‌నేంటో చూపించాడు. స‌చిన్ రికార్డులు కూడా బ్రేక్ చేశాడు. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 95.63 సగటుతో 765 పరుగులు చేశాడు. 3 సెంచరీలతో పాటు 6 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. సింగిల్ ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. వన్డేల్లో 50 సెంచరీల ఘనతను అందుకొని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకుండా వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో తొలి వికెట్‌ను కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి ఈ ఏడాది కోహ్లీకి ఐసీసీ‌తో పాటు ఐపీఎల్ టైటిల్ గెలవకపోవడం కాస్త నిరాశ‌ని మిగిల్చింది.

Exit mobile version