- రోహిత్‌శర్మ స్థానంలో కెప్టెన్‌గా హార్డిక్ పాండ్యా
- జీర్ణించుకోలేక పోయిన అభిమానులు
- ఎక్స్ నుంచి తప్పుకుంటూ షాక్
రోహిత్ శర్మనా మజాకా! అభిమాన కెప్టెన్‌ను మార్చేస్తే అభిమానులు ఊరుకుంటారా! ఊరుకోలేదు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్‌శర్మ స్థానంలో హార్డిక్ పాండ్యాను నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు.. ముంబై ఇండియన్స్ ఎక్స్ ఎకౌంట్ నుంచి క్విట్ అయ్యారు. అదీ వెయ్యీ పదివేలు కాదు.. ఏకంగా 4 లక్షలకు పైగా అభిమానులు కెప్టెన్ మార్పిడి జరిగిన గంట వ్యవధిలోనే ముంబై ఇండియన్స్ ఎక్స్ ఖాతా నుంచి వైదొలిగి.. తమ ఆగ్రహాన్ని ప్రకటించారు. దాదాపు పదేళ్లుగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉన్నాడు. పాండ్యాను కొత్త కెప్టెన్‌గా శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ఐదు టైటిళ్లను రోహిత్‌శర్మ కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్ సాధించింది.
ఈ ఘనతను 2023 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సమం చేశాడు. 2023 ప్రపంచకప్‌లో హృదయవిదారక ఓటమి అనంతరం రోహిత్ శర్మ క్రికెట్‌కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సారథి మార్పును ప్రకటించింది. ముంబై ఇండియన్స్ నుంచి ఐపీఎల్‌కు రంగ ప్రవేశం చేసిన పాండ్యా.. రెండు సంవత్సరాల పాటు గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉండి.. మళ్లీ ముంబై ఇండియన్స్‌లోకి వస్తున్నాడు. తమ తొలి సీజన్‌లోనే రాజస్థాన్ రాయల్స్‌ను 2022లో ఓడించి టైటిల్‌ను గుజరాత్ టైటాన్స్ సాధించింది.