ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకి తెరపడింది.. అయోధ్య పుణ్య క్షేత్రంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అట్టహాసంగా జరిగింది. వేలాది మంది అతిథుల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్ లగ్న ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలైంది. 12 గంటల 30 నిమిషాల 32 సెకన్లకు ప్రాణ ప్రతిష్ఠ ముగిసింది.. అంటే 84 సెకన్లపాటు మాత్రమే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాలకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా పలువురు ప్రముఖ క్రికెటర్లను బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఆహ్వానం అందుకున్న వారిలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ క్రికెటర్లకు ఆహ్వానం అందింది. మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌ను స్వాగతించారు. అయితే వారిలో స్టార్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మిథాలీ రాజ్, అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజా, వెంకటేశ్ ప్రసాద్‌తో పాటు ఇతర క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. బ్యాడ్మింటన్ నేషనల్ కోచ్ గోపీచంద్, ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బాలరాముడిని దర్శించుకున్నారు.
అయితే ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్ వంటి ప్రముఖులు బాల రాముడి ప్రాణ ప్రతిష్టకి హాజరు కాకపోవడం పట్ల నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రైవేట్ పార్టీలకు, యాడ్ షూటింగ్‌లకు వెళ్లడానికి ధోనీకి సమయం ఉంటుందని, ఇలాంటి మహనీయమైన కార్యక్రమానికి వెళ్లడానికి తీరికలేదా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవల ధోని ఓ పార్టీలో హుక్కా కొడుతూ కనిపించాడు. దానిని గుర్తు చూస్తూ… దమ్ము కొట్టే తీరిక ఉంది కాని, అయోధ్యకు వచ్చే టైం లేదా అని ధోనికి నెగటివ్‌గా పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్‌తో బిజీగా ఉండడం, వ్యక్తిగత విషయాలతో కోహ్లి రాలేకపోయడానికి కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం వారిద్దరిని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ధోనినే ఎక్కువ మంది టార్గెట్ చేసి ట్రోల్ చేస్తుండగా, ఆయన పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.