ఆదివారం మాత్రం క్రికెట్ ప్రేమికులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందింది అని చెప్పాలి. రెండు మ్యాచ్‌లు కూడా చాలా థ్రిల్లింగ్‌గా సాగాయి. జైపుర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 193 పరుగులు చేయగా, ఆ జట్టులో . సంజు శాంసన్ (82*; 52 బంతుల్లో) , రియాన్ పరాగ్ (43; 29 బంతుల్లో) మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇక వారితో పాటు యశస్వీ జైస్వాల్ (24; 12 బంతుల్లో), ధ్రువ్ జురెల్ (20*; 12 బంతుల్లో) బ్యాటు ఝుళిపించారు. ఇక లక్ష్య చేధనలో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేసింది. నికోలస్ పూరన్ (64*; 41 బంతుల్లో), కేఎల్ రాహుల్ (58; 44 బంతుల్లో) చాలా వరకు తమ జట్టుకి విజయాన్ని అందించేందుకు ప్రయత్నించారు. కాని చివరలో సందీప్, ఆకాశ్ అద్భుతమైన బౌలింగ్ చేయడంతో ఆర్ఆర్ ఖాతాలో విజయం చేరింది.
ఇక ఆదివారం జరిగిన మరో మ్యాచ్‌లో ముంబై.. గుజరాత్ జెయింట్స్‌పై పరాజయం చెందింది. కెప్టెన్ మారిన కూడా ముంబై జట్టు గత 12 ఏళ్లుగా తొలి మ్యాచ్ ఓటమి గండాన్ని గట్టెక్కలేకపోతుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(39 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45), శుభ్‌మన్ గిల్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31)మొదట్లో మంచి పరుగులు రాబట్టగా, చివర్లో రాహుల్ తెవాటియా(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22) మెరుపులు మెరిపించడంతో జీటీ ఆ స్కోరు సాధించింది.ఇక లక్ష్య చేధనలో ముంబై తడబడింది. మొదట్లోనే ఇషాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ(29 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43), డెవాల్డ్ బ్రెవాస్(38 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46)ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
70 పరుగులతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని సాయి కిషోర్ విడదీసాడు. స్టన్నింగ్ డెలివరీతో రోహిత్ శర్మను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు సాయి కిశోర్. ఇక అదే పనిగా షాట్స్ ఆడుతున్న డెవాల్డ్ బ్రెవిస్(46) మోహిత్ శర్మ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత . గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై ఓటమి పాలైంది. 2013 నుంచి తాజా సీజన్ వరకు ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది లేదు. ఇక ఇదిలా ఉంటే గ్రౌండ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఫీల్డ్ సెటప్ విషయంలో హార్దిక్ పాండ్యా సూచనలను జస్‌ప్రీత్ బుమ్రా పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో రోహిత్ జోక్యం చేసుకొని వారిని కూల్ చేశాడు. రోహిత్‌పై కూడా ఓ సందర్భంలో హార్ధిక్ ఫైర్ అయినట్టు తెలుస్తుంది.