Site icon vidhaatha

కన్నీటిపర్యంతమైన సాక్షి మాలిక్‌.. రెజ్లింగ్‌ వదిలేస్తానని ప్రకటన

న్యూఢిల్లీ: బ్రిజ్‌భూషణ్‌ మద్దతుదారు సంజయ్‌సింగ్‌ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడైతే తాను రెజ్లింగ్‌ను వదిలేస్తానని ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌ ప్రకటించారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌గా సంజయ్‌ సింగ్‌ ఎన్నికైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌గా సంజయ్‌ గెలవడంపై ఆయన నిస్సహాయతను వ్యక్తం చేశారు. కామన్‌వెల్త్‌ స్వర్ణ పతక విజేత అనితా షెరాన్‌ ప్యానెల్‌ను సంజయ్‌ ప్యానెల్‌ 40-7 తేడాతో ఓడించింది.


లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌ సన్నిహితులు, కుటుంబ సభ్యులను అనుమతించబోమని ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు హామీ ఇచ్చిన కేంద్ర క్రీడాశాఖ తన హామీని నిలుపుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంజయ్‌సింగ్‌.. మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు కుడిభుజం లాంటివాడని సాక్షిమాలిక్‌ ఆరోపించారు. టోక్యో ఒలింపిక్‌ పతక విజేత బజరంగ్‌ పునియాతో కలిసి మీడియాతో మాట్లాడిన సాక్షి.. ఒక దశలో తీవ్ర ఆవేదనతో కంటనీరు పెట్టుకున్నారు. బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా తాము ఆందోళనకు దిగినప్పుడు సహకరించిన ప్రజలకు, మీడియాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ‘మేం 40 రోజులు రోడ్లపైనే నిద్రపోయాం. దేశం నలుమూలల నుంచి అనేక మంది వచ్చి మాకు మద్దతు పలికారు.


బ్రిజ్‌భూషణ్‌ వ్యాపార భాగస్వామి, ఆయన సన్నిహితుడు ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటే నేను రెజ్లింగ్‌ను వదిలేస్తున్నా’ అని భావోద్వేగంతో ప్రకటించారు. మీడియా సమావేశం నుంచి కన్నీళ్లతోనే వెళ్లిపోయారు. ఫెడరేషన్‌కు ఒక మహిళ ప్రెసిడెంట్‌గా ఉండాలని తాము కోరుకున్నామని సాక్షి చెప్పారు. అప్పడే మహిళలపై వేధింపులు ఉండవని అన్నారు. ‘గతంలో మహిళా ప్రాతినిథ్యం లేదు.. ఇప్పుడూ లేదు. ఎన్నికైన ప్యానెల్‌ను గమనిస్తే ఒక్క మహిళ కూడా లేరు’ అని ఆమె అన్నారు. బ్రిజ్‌భూషణ్‌పై బలంగా పోరాడమని, ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని సాక్షిమాలిక్‌ ప్రకటించారు.

Exit mobile version