Site icon vidhaatha

రోహిత్ కాళ్లు మొక్కి జైలు పాల‌య్యాడుగా.. అత్యుత్సాహం ఎంత ప‌ని చేసింది..!

ప్ర‌స్తుతం హైదరాబాద్ ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా భార‌త్‌- ఇంగ్లండ్ మ‌ధ్య టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి రోజు రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఒక‌రు ఉరుక్కంటూ గ్రాండ్‌లోకి వ‌చ్చి రోహిత్ శ‌ర్మ కాళ్లు మొక్కాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఇండియా తొలి ఇన్నింగ్స్ ఆడటానికి యశస్వితో కలిసి రోహిత్ శర్మ క్రీజు దగ్గరకి వచ్చినప్పుడే ఈ ఘటన జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి వ‌చ్చిన రోహిత్ శర్మ అభిమాని ఆ సమయంలో విరాట్ కోహ్లి 18 నంబర్ జెర్సీ వేసుకొని ఉండటం గమనార్హం. ఆ స‌మ‌యంలో త‌న కాళ్లు ప‌ట్టుకోవ‌ద్దు అని వారిస్తున్నా కూడా ఆ అభిమాని విన‌లేదు. వెంటనే అప్రమత్తమైన.. గ్రౌండ్ సెక్యూరిటీ సిబ్బంది అత‌న‌ని బ‌య‌ట‌కు తీసుకెళ్లారు.

అయితే ఈ ఘ‌ట‌న‌ని రాచ‌కొండ పోలీసులు చాలా సీరియ‌స్‌గా తీసుకోగా, అత‌నిపై కేసు కూడా న‌మోదు చేసారు. ఇక మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌ర‌చ‌డంతో అత‌నిపై 14 రోజుల రిమాండ్ విధించ‌డంతో జైలుకి త‌ర‌లించారు. ఆ వ్య‌క్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రాంచంద్రాపురం గ్రామానికి చెందిన హర్షిత్ రెడ్డిగా గుర్తించారు. హర్షిత్ రెడ్డి అత్యుత్సాహం అత‌ను క‌ట‌క‌టాలు పాల‌య్యేలా చేసింది. గ‌తంలోను ఇలా అభిమానులు గ్రౌండ్‌లోకి రావ‌డం చాలానే జ‌రిగాయి. ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా కూడా గ్రౌండ్ సిబ్బంది క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేయ‌లేక‌పోతున్నారు.అయితే క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ వీక్షించే ప్రేక్షకులు.. వారికి కేటాయించిన సీట్లలో మాత్రమే కూర్చోవాలని.. అతిగా ప్రవర్తించి మైదానంలోకి వెళ్తే.. కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇక ఉప్పల్‌ వేదికగా భారత్ – ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆ జ‌ట్టు ఆరు వికెట్ల న‌ష్టానికి 316 ప‌రుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ (148*) అద్భుత సెంచరీతో ఆ జట్టును ఆదుకున్నాడు. ఒక‌వైపు వికెట్లు ప‌డుతున్నా కూడా పోప్ మాత్రం అద్భుత‌మైన బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇక నాలుగో రోజు ఇంగ్లండ్ ఇంకెన్ని ప‌రుగులు సాధిస్తుంది, భార‌త్ ముందు ఎంత ల‌క్ష్యం ఉంచుతుంది అనేది చూడాలి. ప్ర‌స్తుతం క్రీజులో పోప్‌తో పాటు రెహాన్ (16*) ఉన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 190 పరుగులు వెనకబడిన ఇంగ్లాండ్‌ చివరికి 126 పరుగుల లీడ్ సాధించ‌డం విశేషంగా చెప్పవ‌చ్చు.

Exit mobile version