Site icon vidhaatha

ఓట‌మిని అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నా..క‌న్నీళ్లు పెట్టిస్తున్న రోహిత్ శ‌ర్మ వీడియో

భార‌త గ‌డ్డపై జ‌రిగిన వ‌ర‌ల్డ్ కప్ 2023లో భార‌త్ ట్రోఫీ కొడుతుంద‌ని ఎంతో మంది క‌ల‌లు క‌న్నారు. ఆ క‌ల‌లు అన్ని ఫైన‌ల్‌లో అడియాశ‌లు అయ్యాయి. అప్ప‌టి వ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైన‌ల్ వ‌ర‌కు వ‌చ్చిన భార‌త జ‌ట్టు ఫినాలేలో మాత్రం తేలిపోయింది. ఫలితంగా రన్నరప్‌గా నిలిచింది. ఆ స‌మ‌యంలో మైదానాన్ని వీడుతూ భారత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ప్రపంచకప్ ఓటమి అనంతరం దాదాపు 20 రోజుల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు కూడా దూరంగా ఉన్న రోహిత్ .. డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో టీమిండియాకు సారథ్యం వహించనున్నాడు

టెస్ట్‌ సిరీస్‌ కోసం రెడీ అవుతోన్న రోహిత్ శ‌ర్మ ప్ర‌పంచ‌క్ కప్ ఫైన‌ల్ ఓట‌మి గురించి మ‌రోసారి ఎమోష‌న‌ల్‌గా మాట్లాడాడు. ఇప్ప‌టికీ ప్రపంచకప్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాను. కప్ గెలవలేకపోవడం ఇప్ప‌టికీ బాధ‌గా ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి 50 ఓవర్ల ప్రపంచకప్ చూస్తూ పెరిగాను. ఇది నాకు గొప్ప అవకాశం. ఇందుకోసం చాలా కష్టపడ్డాం అయిన చివరి ద‌శ‌లో త‌డ‌బ‌డ‌డం చాలా నిరాశ‌ప‌ర‌చింది. మ‌న క‌ల‌లు నెర‌వేర‌క‌పోతే చాలా బాధ‌గా ఉంటుంది. ప్ర‌స్తుతం నేను ఎంతో నిరాశ‌లో ఉన్నాను. వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ ఓటమిని ఎలా అధిగ‌మించాలో తెలియ‌డం లేదు. అయితే క్లిష్ట స‌మ‌యంలో నా నా కుటుంబం, స్నేహితులు నాకు అండగా నిలిచారు. ఓటమిని అంగీకరించడం అంత సులభం కాదు. అయితే అన్నిటినీ ముందుకెళ్లడం అనివార్యం అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

నా ద‌గ్గ‌ర‌కు చాలా మంది వ‌చ్చి భార‌త జ‌ట్టు గురించి గ‌ర్వ‌ప‌డుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఆ మాట‌లే నాకు కొంత ఊర‌ట‌నిచ్చాయి. ఇప్పుడిప్పుడే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ బాధ నుండి తేరుకుంటున్నాను. మాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన మద్దతు లభించ‌డం చాలా ఉప‌శ‌మ‌నాన్ని ఇచ్చింది. ఫైనల్‌లోనూ ఓటమి పాలైన తర్వాత కూడా మాకు అండగా నిలిచారు. ఆ మద్దతే ఇప్పుడు నాకు కొత్త స్ఫూర్తిని ఇచ్చింది. అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని రోహిత్‌ శర్మ త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియోలో తెలియ‌జేశాడు. అయితే మీరు ఇచ్చిన స్ఫూర్తితో మరో ట్రోఫీ కోసం మళ్లీ ప్రయత్నిస్తాం” అని రోహిత్ అన్నాడు. ప్ర‌స్తుతం రోహిత్ వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Exit mobile version