టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ఏడాది పెద్దగా అచ్చిరాలేదు. వ్యక్తిగతంగా అతడి ప్రదర్శన బాగానే ఉన్నా కూడా కెప్టెన్‌గా మంచి విజయాలని అందుకోలేకపోయాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి, ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోవడం వంటి ఘటనలని రోహిత్ శర్మని తీవ్రంగా బాధిస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టును ప్లే ఆఫ్స్ వరకు చేర్చిన రోహిత్ శర్మ అండ్ టీం క్వాలిఫయర్‌లోనే వెనుదిరిగి టైటిల్ అందుకోలేపోయింది.దీని ప్రభావమో ఏమో కాని రోహిత్ శర్మని తప్పించి హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీని అందించింది ముంబై ఇండియన్స్ జట్టు.అయితే మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం పట్ల రోహిత్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.
కొందరు సోషల్ మీడియా వేదికగా ముంబై ఇండియన్స్ పేజీలను అన్‌ఫాలో చేస్తుంటే.. మరికొందరు ఆ జట్టు జెర్సీ, క్యాప్‌లను తగలబెట్టి తమదైన శైలిలో నిరసన తెలుపుతున్నారు. ఇంకొందరు ముంబై ఇండియన్స్ కి రోహిత్ శర్మ ఆడొద్దంటూ సూచనలు చేస్తున్నారు. ఇదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి రావాలని బద్రినాథ్ వంటి ఆటగాళ్లు అంటుంటే మరి కొందరు సన్‌రైజర్స్ లోకి రావాలని సూచనలు చేస్తున్నారు. ఆరంభంలో రోహిత్ శర్మ హైదరాబాద్‌కు చెందిన డెక్కన్ చార్జెర్స్ జట్టుతోనే ఆడాడని, 2009లో టైటిల్ గెలవడంలో కూడా రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడని , అతను ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడడం ఎంతైన అవసరం ఉందని కొందరు పోస్ట్‌లు పెడుతున్నారు.
ఏంటి.. రోహిత్ శర్మ సన్‌రైజర్స్‌లోకి జంప్ అవుతున్నాడా..!మరి డిసెంబర్ 19న ఐపీఎల్ 2024 వేలం తర్వాత కూడా ట్రేడింగ్‌కు అవకాశం ఉందని , ఆ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సైతం రోహిత్ శర్మతో సంప్రదింపు జరపాలని కోరుతున్నారు. ఐపీఎల్ ప్రారంభమయ్యే ముందు నెలవరకు ఆటగాళ్లను ట్రేడింగ్ చేసుకునే వెసులు బాటును బీసీసీఐ కల్పించడంతో ఆటగాళ్లు ఆయా జట్లు మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో రోహిత్ ముంబై జట్టుని వీడి వేరే టీంకి వెళతాడా లేదా అన్నది చూడాలి. అయితే గతంలో రోహిత్.. ఐపీఎల్‌లో తన చివరి మ్యాచ్ ముంబై తరఫునే ఆడుతానని , అవసరమైతే ఆట నుంచి తప్పుకుంటాడే తప్పా మరో జట్టు తరఫున అయితే ఆడే అవకాశం లేదని అన్నాడు.