స‌మిష్టిగా రాణించి ఫైన‌ల్‌కి దూసుకెళ్లిన ఆర్సీబీ.. ఆదివారం ఢిల్లీతో ఫైన‌ల్‌

  • Publish Date - March 16, 2024 / 01:21 AM IST

ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 లో ప్ర‌తి మ్యాచ్ చాలా ఆస‌క్తిక‌రంగా సాగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. నిన్న రాత్రి జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్ కూడా ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు . ఢిల్లీ వేదికగా జ‌రిగిన మ్యాచ్‌లో బెంగళూరు అయిదు పరుగుల తేడాతో విజ‌యం సాధించి ఫైన‌ల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మైంది. ఓ స‌మ‌యంలో ఫీల్డింగ్ త‌ప్పిదాల వ‌ల‌న ఓడిపోతుంద‌నుకున్న ఆర్సీబీ ఆ త‌ర్వాత మాత్రం ఒత్తిడిని జ‌యించి ఫైన‌ల్‌కి చేరుకుంది.

ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయ‌గా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (66; 50 బంతుల్లో) అద్భుత‌మైన ఆట తీరుతో జ‌ట్టుకి మంచి స్కోరు ద‌క్కేలా చేసింది. ఆర్సీబీ ఓపెనర్లు సోఫీ డివైన్ (10; 7 బంతుల్లో), స్మృతి మంధాన (10; 7 బంతుల్లో) స్వ‌ల్ప కోరుకే వెనుదిర‌గ‌డంతో జ‌ట్టు క‌ష్టాల‌లో ప‌డింది. దిశా ఏడు బంతులు ఎదుర్కొని డ‌కౌట్ కాగా, ఆ త‌ర్వాత వ‌చ్చిన రిచా ఘోష్ (14; 19 బంతుల్లో) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిల‌వ‌లేక‌పోయింది. అయితే ఒక‌వైపు వికెట్స్ ప‌డుతున్నా కూడా ఎలిస్ పెర్రీ చెత్త బంతుల్ని బౌండరీకి తరలిస్తూ స్కోరుబోర్డు ప‌రుగులు పెట్టేలా చేసింది. చివ‌రి 5 ఓవ‌ర్ల‌లో ఆర్సీబీకి 51 ప‌రుగులు రాగా, అది పెర్రీ సృష్టించిన విధ్వంసం అని చెప్పాలి. ఇక ముంబై బౌలర్లలో హేలీ మాథ్సూస్, నాట్ సీవర్, సైకా తలో రెండు వికెట్లు తీశారు.

అయితే 136 ప‌రుగుల లక్ష్యాన్ని చేధించే క్ర‌మంలో ముంబై త‌డ‌బ‌డింది. 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33; 30 బంతుల్లో), అమెలీ కేర్ (27; 25 బంతుల్లో) త‌ప్ప మిగతా ఎవ‌రు పెద్ద‌గా రాణించ‌లేదు. ఓపెనర్లు యస్తికా భాటియా (19; 27 బంతుల్లో), హేలీ మాథ్యూస్ (15; 14 బంతుల్లో) మొద‌ట్లో వికెట్ ప‌డ‌కుండా కాస్త నెమ్మ‌దిగా ఆడారు.కాని దూకుడు బ్యాటింగ్ చేసే క్ర‌మంలో వికెట్స్ పొగొట్టుకున్నారు. ముంబై విజయ సమీకరణం ఆఖరి 18 బంతుల్లో 20 పరుగులు రావ‌ల్సి ఉన్న స‌మ‌యంలో క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ అద్భుతంగా రాణించారు. చివ‌రి మూడు ఓవ‌ర్స్ క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ముంబై ల‌క్ష్యాన్ని చేధించ‌లేక‌పోయింది. మొత్తానికి ఆదివారం జ‌ర‌గ‌నున్న ఫినాలేలో ఢిల్లీని ఆర్సీబీ ఢీకొన‌బోతుంది.

Latest News