బిగ్ బాస్ సీజన్ 7కి ఈ ఆదివారంతో ఎండ్ కార్డ్ పడనుంది. ప్రస్తుతం హౌజ్‌లో శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్, అర్జున్, యావర్, ప్రియాంకలు ఉండగా,వారు చివరి క్షణాలని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బిగ్ బాస్ కూడా వారికి అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. అమర్‌దీప్, అర్జున్‌ల గురించి ఏవీలు చూపించి ఫుల్ సర్‌ప్రైజ్ చేసిన బిగ్ బాస్ తాజా ఎపిసోడ్‌లో శివాజి, ప్రియాంకలని ఎమోషనల్ అయ్యేలా చేశాడు. ఒకవైపు వారి పర్సనాలిటీని కీర్తిస్తూ… వారు ఇన్ని రోజులు పడ్డ కష్టం గురించి అద్భుతంగా చూపించారు. అంతేకాకుండా వారి బెస్ట్ మూమెంట్స్‌కి సంబంధించిన ఫొటోలని గార్డెన్ ఏరియాలో ముస్తాబు చేయగా, అవి చూసి తెగ మురిసిపోయారు.
అయితే తాజా ఎపిసోడ్‌లో ముందుగా శివాజిని పిలిచిన బిగ్ బాస్ అతనిని సంభ్రమాశ్చర్యాలకి గురిచేశాడు. తన వెల్‌కమ్ డెకరేషన్ చూసి థ్రిల్ అయ్యాడు. నా ఇరవై ఏళ్ల కెరీర్ ఓ ఎత్తు, ఈ బిగ్ బాస్ ఓ ఎత్తు అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. ఇక శివాజీ ఏవీ ప్లే చేయగా,అందులో మిమ్మల్ని ఒక్కరు వేలెత్తి చూపిస్తే, మిగిలిన నాలుగు వేళ్లు మీ వైపే ఉన్నాయని చెప్పే మాటకారి మీరు. మీ గాయం మిమ్మల్ని ఎంత బాధించినా, ఓటమి వైపు చూడలేదు. మీ అబ్బాయే మీ డాక్టర్‌గా వచ్చినప్పుడు మీ బాధనంతా మర్చిపోయారు. సరైన సమయంలో సరైన పావులు కదిపి చాణుక్యుడిగా నిలిచారు. ఈ పూర్తి సీజన్‌లో మీ పై పై చేయి సాధించిన ఒకే ఒక విషయం కాఫీ పై మీ ఇష్టం మాత్రమే అని చెప్పిన బిగ్ బాస్ శివాజి కంట కన్నీరు కూడా కార్చేలా చేశాడు. ఏవి చూశాక తన ఆనందాన్ని అందిరితో షేర్ చేసుకున్నాడు.
ఇక అనంతరం గార్డెన్ ఏరియాలోకి వచ్చిన ప్రియాంకని ఘనంగా కీర్తించారు. ఎవరితో స్నేహం సరైనదో, ఆటలో ముందుకు వెళ్లేందుకు ఏ దారి ఎంచుకోవాలో స్పష్టత మీకు ఉందని అన్నారు.. ఇంటికి ఆయువు పట్టులాంటి కిచెన్‌కి ఉన్న శక్తిని అర్థం చేసుకుని అక్కడి నుంచే ఆట ప్రారంభించారని, సింపుల్ ప్రియాంకలా ఉండే మీరు శివంగిలా విరుచుకుపడుతూ నామినేషన్‌లలో మీరేంటే అందరికి అర్ధమయ్యేలా చేసింది. ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా అద్భుతమైన ఆటతో ప్రతి ఒక్కరి మనసులు గెలుచుకున్నారు అంటూ ప్రియాంక గురించి గొప్పగా చెప్పారు బిగ్ బాస్. ఇక ఆమెకి సంబంధించిన ఫొటో ఫ్రేములు కూడా చూసి ఫుల్ ఖుష్ అయింది ప్రియాంక. మరి నేటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఎవరెవరికి ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఇస్తారో చూడాలి.