Viral News | కరోనా చైనాలో మరోసారి విజృంభిస్తున్నది. బీఎఫ్.7 వేరియంట్ కారణంగా రోజు రోజుకు పరిస్థితి చేజారుతున్నది. ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాల్సింది పోయి కావాలని వైరస్ అంటించుకుంది చైనీస్ సింగర్. అవును మీరు చదివింది నిజమే.. ఉద్దేశ పూర్వకంగానే వైరస్ అంటించుకున్నట్లు ఆన్‌లైన్ వేదికగా తెలిపింది.
చైనాలో ప్రముఖ గాయని జేన్ ఝూంగ్ తాను కావాలని వైరస్‌ను అంటించుకున్నట్లు ప్రకటించింది. నూతన సంవత్సర వేడుకల్లో ఓ ప్రదర్శన ఇవ్వనున్నట్లు చెప్పింది. ఆ సమయంలో కరోనా బారిన పడితే ఇబ్బందులు ఎదురవుతాయని భావించానని, అందుకే ముందస్తుగానే వైరస్ సోకేలా ప్రయత్నించినట్లు సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించింది.
వైరస్ సోకేలా కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను కలిసినట్లు చెప్పింది. ప్రస్తుతం తనకు వైరస్ సోకిందని, నూతన సంవత్సరం వేడుకల నాటికి వైరస్ నుంచి కోలుకునేందుకు సమయం దొరికిందంటూ చెప్పింది. కొవిడ్ బాధితులను కలిసిన తర్వాత జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పుల తదితర లక్షణాలు కనిపించాయని, విటమిన్ సీ టాబ్లెట్స్ తీసుకున్నానని, ఒక రోజు తర్వాత లక్షణాలు కనిపించలేదని వెల్లడించింది.
ఆ పోస్టులు చూసిన నెటిజన్ సింగర్‌పై మండిపడ్డారు. ఆమెకు చెవుడు కావొచ్చని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సంగీత కచేరీ కోసం ఆమె అనారోగ్యాన్ని తెచ్చుకున్నది అంటూ మరో యూజర్ మండిపడ్డారు. అలాగే పలువురు ఆమె వ్యవహార శైలిని తూర్పారబట్టారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఆ తర్వాత సింగర్ పోస్టును తొలగించింది.