Site icon vidhaatha

స్టార్ సింగ‌ర్ కారుని ఢీకొట్టిన డీసీఎం.. పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న స్టార్ సింగ‌ర్

టీవీ షోల నుంచి కెరీర్ మొద‌లు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల‌లో కూడా పాట‌లు పాడుతూ మోస్ట్ వాంటెడ్ సింగ‌ర్‌గా మారింది మంగ్లీ. ఏ పాట అయిన కూడా త‌న గొంతుతో ఇట్టే ఆకర్షిస్తుంది. జాన‌ప‌దం, ఫోక్, ఆధ్యాత్మికం ఇలా ఏ పాట అయిన స‌రే మంగ్లీ గొంతులో నుండి వ‌చ్చిందంటే అది హిట్ కావ‌ల్సిందే. ఇటీవ‌లి కాలంలో పాపుల‌ర్ ఫీమేల్ సింగ‌ర్‌గా మారిన మంగ్లీ వ‌రుస అవకాశాల‌తో దూసుకుపోతుంది. సింగింగ్ కాంపిటీష‌న్ ల‌కి జ‌డ్జిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తుంది మంగ్లీ. ఎలాంటి ఫెస్టివ‌ల్స్ వ‌చ్చిన కూడా మంగ్లీ నుండి స్పెష‌ల్ సాంగ్ రావ‌ల్సిందే.

అయితే టాలీవుడ్‌లో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న మంగ్లీ పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకుంది. కారులో ప్రయాణిస్తున్న మంగ్లీ కారును డీసీఎం వాహనం ఢీ కొట్టడంతో ప్ర‌మాదం జ‌రిగింది. శంషాబాద్ తొండుపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. నందిగామ కన్హ శాంతివనంలో ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజ‌రై త‌ర్వాత‌ అర్ధరాత్రి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో మంగ్లీ కారును వెనక నుంచి డీసీఎం వాహనం ఢీ కొట్టింది.దీంతో కారులో ఉన్న‌ మంగ్లీతో పాటు మేఘరాజ్, మనోహర్‌ అనే ఇద్దరు వ్యక్తుల‌కి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. వారు ముగ్గురు కూడా పెద్ద ప్ర‌మాదం నుండే బ‌య‌ట‌ప‌డ్డారు.

డీసీఎం డ్రైవర్ మద్యం మత్తు కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలియ‌జేశారు. గ‌తంలోను మంగ్లీ కారు ప్ర‌మాదానికి గురైంద‌ని ప్ర‌చారాలు రాగా, వాటిని ఈ సింగ‌ర్ ఖండించింది. అయితే తాజాగా మంగ్లీకి పెద్ద ప్రమాదం తప్పడంతో ఆమె అభిమానులు, స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Exit mobile version