వన్డే ప్రపంచకప్ 2023లో శనివారం రోజు రెండు మ్యాచ్‌లు జరిగాయి. శ్రీలంక- నెదర్లాండ్స్ మధ్య ఆసక్తికర ఫైట్ జరగగా, ఈ పోరులో శ్రీలంక గెలిచింది. ఇక ఇంగ్లండ్- సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. సమష్టిగా విఫలమైన ఇంగ్లండ్ 229 పరుగుల భారీ తేడాతో భారీ అపజయం మూటగట్టుకుంది. ఇది వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే ఇంగ్లండ్‌కు ఇది అత్యంత ఘోర పరాజయంగా చెప్పవచ్చు. గత మ్యాచ్‌లో పసికూడా ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు ఇప్పుడు సౌతాఫ్రికాపై అంత చిత్తుగా ఓడిపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
ముందుగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. హెన్రీచ్ క్లాసెన్(67 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. రీజా హెండ్రీక్స్(75 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 85), రాసీ వాన్ డెర్ డస్సెన్(61 బంతుల్లో 8 ఫోర్లతో 60), మార్కో జాన్సెన్(42 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సౌతాఫ్రికాకి భారీ స్కోర్ దక్కేలా చేశారు. ఇక 400 లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఏ సమయంలో కూడా లక్ష్యం దిశగా సాగుతున్నట్టు అనిపించలేదు. గెరాల్డ్ కోయిట్జ్ (3/35) మూడు వికెట్లతో చెలరేగగా.. లుంగి ఎంగిడి(2/26), మార్కో జాన్సెన్(2/35) రెండేసి వికెట్లు , కగిసో రబడా, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీయడంతో ఇంగ్లండ్ జట్టు 170 పరుగులకి ఆలౌట్ అయింది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో మార్క్‌వుడ్ (17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 నాటౌట్), గస్ అట్కిన్సన్(21 బంతుల్లో 7 ఫోర్లతో 35) మాత్రమే కాస్త రాణించారు. అయితే ఇంగ్లంండ్ ఆడిన మొదటి నాలుగు మ్యాచుల్లో ఇది మూడో ఓటమి కాగా, ఇంగ్లండ్ నాకౌట్ లో నిలవాలి అంటే మిగతా ఐదు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సి ఉంటుంది. ఏ ఒక్క మ్యాచ్ ఓడిన కూడా ఇంగ్లండ్ జట్టు ఇంటి బాట పట్టడం ఖాయం. 169 పరుగులకి ఆఖరి స్థానంలో నిలవాల్సిన ఇంగ్లాండ్ జట్టు, 1 పరుగు ఎక్కువగా చేయడంతో ప్రస్తుతం 9వ స్థానంలో నిలిచింది.