టాలీవుడ్ సీనియర్ నటుడు సురేష్ గురించి ఈ తరం వారికి పెద్దగా పరిచయం లేదు. అప్పట్లో స్టార్ హీరోగా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని పలకరించారు. తెలుగు, తమిళంతో పాటు పలు భాషలలో నటించి మెప్పించాడు. దాదాపు 270కి పైగా సినిమాలలో నటించి అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నాడు సురేష్. కొన్నాళ్ల పాటు స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన సురేష్ ఆ తర్వాత విలన్‌గా, తండ్రిగా, ఇతర సపోర్టింగ్ పాత్రలలో కనిపిస్తూ సందడి చేశాడు. అయితే ఆ మధ్య సురేష్ చాలా లావుగా కనిపించి అందరికి పెద్ద షాకిచ్చాడు.కాని ఇటీవల చాలా స్లిమ్‌గా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భార్యతో తాను ఎందుకు విడిపోయాడో కారణం చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సురేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన సురేష్ తన మొదటి భార్య పేరు అనితా రెడ్డి అని చెప్పుకొచ్చాడు. తాను కూడా మొదటి నుండి ఇండస్ట్రీలో ఉండేదని, కాకపోతే తనకి చదువుకోవాలనే కోరిక ఎక్కువ ఉండడంతో సినిమాలు మానేసింది. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తన పేరుని అనితా సురేష్ అని మార్చుకోగా మేమిద్దరం విడిపోయిన తర్వాత కూడా ఆ పేరుని ఆమె అలానే ఉంచుకుందని సురేష్ తెలియజేశాడు.మాకు ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే అనిత, నేను విడిపోయిన కూడా ఇప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటున్నాం. మేం విడిపోవడానికి పెద్ద కారణాలు ఏమి లేవు. మా మధ్య పెద్ద గొడవలు ఏమి జరగలేదు. ఆమెకు పెద్ద చదువులు చదవాలని అమెరికాలో సెటిలవ్వాలని కోరిక ఉండేది. అయితే అప్పుడు నేను సినిమాల్లో బిజీగా ఉండటంతో తనతో రావడం కుదరదని చెప్పి విడాకులు తీసుకొని విడిపోయాం.
అమెరికాలో చదువుకుని అక్కడే ఓ వ్యక్తిని వివాహం చేసుకుని ఇప్పుడు ఆమె అక్కడే సెటిల్ అయింది. ఇప్పటికీ ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. ఎప్పుడైన అమెరికా వెళితే వాళ్ల ఇంట్లోనే ఉంటాను. అలానే తాను ఇక్కడికి వస్తే మా ఇంటికి వస్తారు. అనిత భర్త కూడా మంచివారు. నా కొడుకుని చాలా బాగా చూసుకుంటాడు. మేము మా ఆస్తులను సమానంగా పంచుకున్నామని సురేష్ చెప్పుకొచ్చారు. నేను కూడా దర్శకరచయిత్రి రాశి ని రెండో పెళ్లి చేసుకున్నానని సురేష్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాగా 1995లో సురేష్- అనిత విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక సురేష్ ఇప్పటికీ ఏదో సినిమాలో అలా మెరుస్తూనే ఉన్నారు.