Daniel Balaji | సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు డేనియల్‌ బాలాజీ కన్నుమూత

  • Publish Date - March 30, 2024 / 01:17 AM IST

Daniel Balaji | దక్షిణ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. తమిళ నటుడు డేనియల్‌ బాలాజీ (48) తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆయన శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఛాతినొప్పితో అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబీకులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు. అయితే, ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలుస్తున్నది. డేనియ‌ల్ బాలాజీ త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, కన్నడలో దాదాపు 50కిపైగా చిత్రాల్లో నటించారు. ఆయన ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రలనే పోషించాడు. డేనియల్‌ బాలాజీ తమిళ చిత్రం ‘చిట్టి’ సీరియల్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. రాధిక లీడ్‌ రోల్‌ పోషించిన ఈ సీరియల్‌ తెలుగులో ‘పిన్ని’గా డబ్‌ అయ్యింది.

ఆ తర్వాత ఏప్రిల్‌ మదాతిల్‌, కాదల్‌ కొండెన్‌ చిత్రాల్లో నటించారు. క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా గౌత‌మ్ మీన‌న్ దర్శకత్వంలో వచ్చచిన ‘రాఘ‌వ‌న్’ చిత్రంలో సైకో క్యారెక్టర్‌తో సినీ ప్రియులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో డేనియల్‌కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత తమిళంలో పొల్లవ‌ద‌న్‌, జ్ఞాన‌కిరుక్కన్‌, అచ్చం యెన్‌బ‌దు మద‌మైయదా, వ‌డాచెన్నై, బిగిల్‌తో పాటు పలు సినిమాల్లో నటించాడు. చివ‌ర‌గా ‘అరియ‌వాన్’ త‌మిళ సినిమాలో కనిపించాడు. బాలాజీ తెలుగులో ఐదారు సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ సాంబ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. వెంక‌టేశ్‌ ‘ఘ‌ర్షణ’ మూవీలో హీరో ఫ్రెండ్‌గా క‌నిపించాడు. రామ్‌చ‌ర‌ణ్ చిరుత‌, నాగ‌చైత‌న్య సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రాల్లోనూ నటించాడు. నాని హీరోగా 2021లో రిలీజైన ట‌క్ జగదీశ్‌ మూవీలో ప్రతినాయకుడిగా కనిపించాడు. తెలుగులో బాలాజీకి ఇదే చివరి చిత్రం.

కెరియర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయిన తన తనటతో ఎంతో గుర్తింపు సాధించాడు. బాలాజీ డేనియ‌ల్ తెలుగు మూలాలున్న కుటుంబంలో జ‌న్మించాడు. బాలాజీ తండ్రి తెలుగువాడు కాగా.. తల్లి మాత్రం తమిళ్‌కు చెందినవారు. డైరెక్టర్ కావాల‌ని ఫిలిం మేకింగ్ కోర్సు పూర్తి చేసిన బాలాజీ చివరకు నటుడిగా స్థిరపడ్డాడు. బాలాజీ అంత్యక్రియలు ఇవాళ చెన్నైలోని పురసామివాకంలో నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. బాలాజీ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Latest News