Site icon vidhaatha

కొత్త ఏడాది టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు ఆడ‌నుంది, ఎవ‌రెవ‌రితో త‌ల‌ప‌డ‌నుంది అంటే..!

2023లో భార‌త్ వేదిక‌గా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌గా, ఈ టోర్నీలో భార‌త్ ఒక్క ఫైన‌ల్ మ్యాచ్ త‌ప్ప అన్ని మ్యాచ్‌లు గెలిచింది. ప‌క్కా క‌ప్ కొడుతుంద‌ని అంద‌రు భావించగా వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. అయితే 2023 ముగిసింది. 2024లో సరికొత్త ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో భార‌త జ‌ట్టు అద్భుతాలు సృష్టిస్తుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది టీమిండియా లాంగ్ టూర్ ఉండగా, భార‌త జ‌ట్టు ఏ యే జట్లతో , ఏయే సిరీస్‌లలో పాల్గొంటుంద‌నేది చూస్తే రేప‌టి నుండి సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడ‌నుంది. దీని త‌ర్వాత ఆఫ్ఘ‌నిస్తాన్‌తో టీ20 సిరీస్ ఉంది.

ఆఫ్ఘనిస్తాన్‌తో టీ 20 సిరీస్ లో భాగంగా జనవరి 11న మొహాలీలో తొలి టీ 20, జనవరి 14న ఇండోర్‌లో సెకండ్ టీ 20, జనవరి 17న బెంగళూరులో థర్డ్ టీ 20 జ‌ర‌గ‌నున్నాయి. ఆ త‌ర్వాత భారత్‌కు ఇంగ్లాండ్ జట్టు రానుండ‌గా, ఇక్క‌డ‌ 5 టెస్టుల సిరీస్ ఆడ‌నుంది. జనవరి 25 నుంచి 29 వరకు తొలి టెస్టు – హైదరాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నుండ‌గా, ఫిబ్రవరి 02 నుంచి 06 వరకు రెండో టెస్టు – విశాఖపట్నం, ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు మూడో టెస్టు – రాజ్‌కోట్ , ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు – రాంచీ, మార్చి 07 నుంచి 11 వరకు ఐదో టెస్టు – ధర్మశాలలో జ‌ర‌గ‌నున్నాయి.

ఇక ఏప్రిల్‌- మే మ‌ధ్య‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్ జ‌ర‌గ‌నుంది. ఈసారి ఐపీఎల్‌పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఆ త‌ర్వాత జూన్‌లో టీ20 ప్రపంచకప్‌ (వెస్టిండీస్‌, యూఎస్‌ఏలో) జ‌ర‌గ‌నుంది. వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ నెగ్గ‌లేక‌పోయిన భార‌త జ‌ట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ద‌క్కించుకోవాల‌ని క‌సిగా ఉంది. ఇక ఇది పూర్తైన త‌ర్వాత జులైలో శ్రీలంకలో భారత జట్టు పర్యటన . అక్కడ మూడు వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. అనంత‌రం సెప్టెంబరులో భారత్‌కు రానున్న బంగ్లాదేశ్ జ‌ట్టు ఇక్క‌డ‌ రెండు టెస్టులు, మూడు టీ20ల్లో తలపడనుంది. అక్టోబర్‌లో భారత్ వేదికగా టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జ‌ర‌గనుండ‌గా, నవంబర్‌, డిసెంబరులలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది భారత్. అక్కడ ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.

Exit mobile version