నేడు UNO అత్యవసర సాధారణ సభ!

  • Publish Date - October 26, 2023 / 05:40 PM IST

ప్రస్తుత గాజా సంక్షోభం ప్రారంభమయ్యాక 12వ రోజు (18-10-2023) UNO భద్రతా సమితిలో రెండు తీర్మానాలు రష్యా, అమెరికా వీటో ప్రయోగం వల్ల వీగిపోయాయి. ఇది సమకాలీన రాజకీయ భూగోళంలో ముఖ్యమైన పరిణామం.

పై నేపథ్యంలో 26న అత్యవసర సాధారణ సభకు ప్రాధాన్యత ఉంది. ఇది అరబ్ లీగ్, ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ డిమాండ్ పై ఏర్పాటు చేయడం జరిగింది. అది న్యూయార్క్ కాలమానం ప్రకారం ఉదయం 10 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.

ఏ దేశ పౌరులపైన జరిగే దాడులనైనా ఖండించే భాగంతో పాటు గాజాకు మానవతా సాయం భాగం బ్రెజిల్ ప్రతిపాదించిన ఒక తీర్మానంలో ఉంది. అదే అమెరికా కడుపుమంటకి కారణం. హమాస్ దాడిని పేరుపెట్టి ఖండించాలనీ, ఇజ్రాయెల్‌కి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉందని తీర్మానంలో పేర్కొనాలని అమెరికా వాదన! దానిపై అమెరికా వీటో చేసింది.

అమెరికా తనదైన శైలిలో మరో పోటీ తీర్మానాన్ని ప్రతిపాదించింది. దానిని రష్యా వీటో చేసింది. USSR పతనం తర్వాత ఏర్పడ్డ ఏకధ్రువ ప్రపంచ వ్యవస్థలో పులి, మేక వంటి రాజ్యాల మధ్య UNO రాజీ ఒప్పందాల్ని చేసే బేరసారాల సంస్థగా దిగజారింది. అది క్రమంగా సన్నాయి నొక్కులతో పోటీ సంస్థగా మారుతూ వచ్చింది. ఇప్పుడు అది మరింత పరస్పర పోటీ కేంద్రంగా మారుతోంది.

న‌ల్ల సముద్రం పక్కన గల దక్షిణ ఒసేతియాని 2008లో రష్యా స్వాధీనం చేసుకోవడంతో బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థకు బీజం పడిందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల అంచనా! అదే రష్యా 2014లో క్రిమియా స్వాధీనానికి దిగింది. అది బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థకు పునాది ని వేసిందని అంతర్జాతీయ పరిశీలక వర్గాల విశ్లేషణ!

పై రెండు ప్రాంతాలు 1991కి ముందు USSR భూభాగాలు కావడం గమనార్హం! బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ బలపడే క్రమంలో రష్యా తన గత పరిధిని దాటి సైనిక విస్తరణకి అడుగులు వేస్తోంది. అది సిరియాకి సాయంగా 2015లో జరిగింది. అది బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ బలపడడానికి దారి తీసింది. మరో ఏడేళ్ల తర్వాత నాటో విస్తరణకి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో రష్యా 2022లో ఉక్రెయిన్ పై యుద్దానికి దిగింది. ఉక్రెయిన్ గత USSRలో భాగమైనా ప్రాంతీయ స్వభావం గల యుద్ధం కాదు. అమెరికా యుద్ధ కూటమితో యుద్ధమిది. ఇది బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థని స్థిరపరిచింది. ఈ పరిణామ క్రమానికి అద్దం పట్టే సంఘటన గత బుధవారం UNO SCలో రెండు తీర్మానాలు కూడా వీగిపోవడం! ఇదో ముఖ్యమైన సమకాలీన అంతర్జాతీయ రాజకీయ పరిణామం. పై నేపథ్యంలో మరికొన్ని గంటల్లో రేపటి UNO అత్యవసర సాధారణ సభ ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం.

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

26-10-2023

Latest News