స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్‌గా కీర్తి ప్రతిష్టలు అందుకున్న చిరు ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేశారు.ఆ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం చిరంజీవికి దక్కడంతో ఆయనకు రెండు రాష్ట్రాలకి చెందిన అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు. తన మావయ్యకి దేశంలోని అత్యున్నత పురస్కారం దక్కడంతో మెగా కోడలు ఉపాసన ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. తన నివాసంలో అభినందన సభ ఒకటి ఏర్పాటు చేసింది.
ఈ గ్రాండ్ పార్టీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘చిరంజీవికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం.. ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని తెలిపారు.ఇక మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్‌ని ఆలింగనం చేసుకొని కొద్ది సేపు ముచ్చటించారు రేవంత్. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్,ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, డీకే అరుణ తదితరులు హాజరై సందడి చేశారు.
కాగా మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకయ్య నాయుడుకు కూడా పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, కూరెళ్ల విఠలాచార్య, వేలు ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్ తదితరులు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఇటీవల చిరంజీవి పద్మ అవార్డ్‌లు సాధించిన కొందరిని సన్మానించిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం భారీ వర్కవుట్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.