కోల్‌క‌తా- ఆర్సీబీ మ్యాచ్‌లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం..వారిద్ద‌రిని అలా చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

  • Publish Date - March 30, 2024 / 01:14 AM IST

ఆర్సీబీ ఖాతాలో మ‌రో అప‌జయం చేరింది.ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా శుక్ర‌వారం కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మ‌ధ్య బెంగళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83) విధ్వంసకర హాఫ్ సెంచరీతో అల‌రించ‌గాగా.. కామెరూన్ గ్రీన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), గ్లేన్ మ్యాక్స్‌వెల్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28), చివర్లో దినేశ్ కార్తీక్(8 బంతుల్లో 3 సిక్స్‌లతో 20) భారీగానే ప‌రుగులు రాబ‌ట్టారు. అయితే 183 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌కి దిగిన కేకేఆర్‌కి మంచి శుభారంభ‌మే ల‌భించింది.

కేకేఆర్ 16.5 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి సునాయస విజయాన్ని చ‌విచూసింది. మొద‌ట్లో సునీల్ నరైన్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 47), ఫిల్ సాల్ట్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) ఆర్సీబీ బౌల‌ర్స్‌ని ఊచ‌కోత కోసారు. ఏ ఒక్క‌రు కూడా వారి జోరుకి అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోయారు. అయితే న‌రైన్, సాల్ట్ ఔటైన కూడా వెంకటేశ్ అయ్యర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 ) హాఫ్ సెంచరీతో రాణించగా శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) గా ఉండి చివ‌రికి జ‌ట్టుని గెలిపించాడు. పేలవ బౌలింగ్‌తో ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో కనీస పోటీ ఇవ్వ‌లేక‌పోవ‌డంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ జిడ్డు బ్యాటింగ్ కూడా ఓట‌మికి ఓ కార‌ణ‌మ‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. ఎప్పుడు నిప్పు, ఉప్పులా ఉండే విరాట్ కోహ్లీ, గౌత‌మ్ గంభీర్ మ్యాచ్ మధ్యలో పరస్పరం హగ్ చేసుకోవ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయంలో గంభీర్ గ్రౌండ్ లోకి వచ్చి కోహ్లీని హ‌త్తుకొని చాలా ఆప్యాయంగా మాట్లాడాడు. వీరిని అలా చూసి ఫ్యాన్స్ కూడా తెగ మురిసిపొయారు. గ‌త సీజ‌న్‌లో గంభీర్, కోహ్లీ మ‌ధ్య వివాదం నెల‌కొన‌గా దానిపై చాలా చ‌ర్చే న‌డిచింది. అయితే కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌కి ముందు చాలా మంది వీరిద్ద‌రు ఎదురెదురు ప‌డితే ఎలా రియాక్ట్ అవుతారో అని అనేక ఆలోచ‌న‌లు చేశారు. కాని ఇద్ద‌రు ఆప్యాయంగా కనిపించ‌డం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా, వన్డే ప్రపంచకప్‌లో నవీన్‌ ఉల్‌ హక్‌, విరాట్‌ కోహ్లి మధ్య పోరు కూడా ముగియ‌డం మ‌నం చూశాం. వీరిద్ద‌రు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.

Latest News