ప్రాక్టీస్ సెష‌న్ ఇంకా మొద‌లు పెట్టని కోహ్లీ.. ఐపీఎల్‌కి కూడా దూరంగా ఉంటాడా అని ఫ్యాన్స్ టెన్ష‌న్

  • Publish Date - March 18, 2024 / 01:48 AM IST

ఇండియ‌న్ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరుకి ఫిదా కాని వారు లేరు. గ్రౌండ్‌లో అల‌వోకగా షాట్స్ ఆడుతూ భారీగా ప‌రుగులు రాబ‌డుతుంటాడు. ఆయ‌న బ్యాటింగ్ చూడాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ముచ్చ‌టప‌డుతుంటారు. అయితే కోహ్లీ గ‌త రెండు నెల‌లుగా క్రికెట్ ఆడ‌డం లేదు. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ ప్రారంభానికి ముందు విరాట్ టీమ్ ఇండియా నుంచి దూరంగా ఉన్నారు. అత‌ను ముందుగా తొలి రెండు టెస్టులు మాత్ర‌మే ఆడ‌ర‌ని అన్నారు. కాని త‌ర్వాత బీసీసీఐ వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల‌న కోహ్లీ జ‌ట్టుకి పూర్తిగా దూరంగా ఉంటాడ‌ని ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అయితే కోహ్లీ ఎందుకు దూరం అయ్యాడ‌నేది త‌ర్వాత అంద‌రికి క్లారిటీ వ‌చ్చింది.

విరాట్, అనుష్క సంయుక్తంగా తమ రెండవ బిడ్డ అకాయ్ గురించి సోషల్ మీడియాలో పంచుకోవ‌డంతో ఇంగ్లండ్ సిరీస్‌కి కోహ్లీ ఎందుకు దూరంగా ఉన్నాడ‌నేది అర్ధ‌మైంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 టోర్నీ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుండ‌గా, తొలి మ్యాచ్ లె చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. మ‌రో నాలుగు రోజుల‌లో మ్యాచ్ ఉండ‌గా, కోహ్లీ ఇంత వ‌ర‌కు ప్రాక్టీస్ సెష‌న్ మొద‌లు పెట్ట‌లేదు. దీంతో కోహ్లీ ఐపీఎల్ కూడా ఆడ‌డా అని అంద‌రిలో అనేక అనుమానాలు తలెత్తాయి. విరాట్ కోహ్లీ ఐపీఎల్ -2024లో ఆడుతాడా లేదా అనే విషయంపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు.

దాంతో కోహ్లీ ఫ్యాన్స్‌లో సందిగ్ధం నెల‌కొంది. అయితే కొద్ది రోజుల క్రితం విదేశాల‌కి వెళ్లిన విరాట్ తిరిగి ఇండియాకి వ‌చ్చాడు. బెంగళూరులోని రాయల్ ఛాలెంజర్స్ క్యాంపులో చేరి శిక్షణ ప్రారంభించనున్నాడు. గత 2 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో దుమ్ము రేప‌నున్నాడ‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ఐపీఎల్‌లో కోహ్లీ అద్భుతంగా రాణిస్తే వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో ఆడ‌తాడు లేదంటే కొత్త ఆట‌గాళ్ల‌కి అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. కోహ్లీ 2024 జనవరి 17న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తన చివరి మ్యాచ్ ఆడాడు.

Latest News