Robert Card | అమెరికాలో కాల్పుల మోత.. ఎవ‌రీ రాబ‌ర్ట్ కార్డ్..?

  • Publish Date - October 26, 2023 / 06:07 AM IST

Robert Card | అమెరికాలోని మైనే రాష్ట్రంలోని లెవిస్ట‌న్‌లో బుధ‌వారం రాత్రి కాల్పుల మోత మోగిన విష‌యం తెలిసిందే. ఈ కాల్పుల్లో 22 మంది మ‌ర‌ణించ‌గా, 50 మంది దాకా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కాల్పుల‌కు పాల్ప‌డిన దుండ‌గుడి చిత్రాల‌ను పోలీసులు విడుద‌ల చేశారు. ఆ దుండ‌గుడిని రాబ‌ర్ట్ కార్డ్‌గా గుర్తించారు.

40 ఏండ్ల వ‌య‌సున్న రాబ‌ర్ట్ కార్డ్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌గా ప‌ని చేసి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. గ‌తంలో గృహ హింస కేసులో అరెస్టు అయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతూ చికిత్స తీసుకున్నాడు. వినికిడి స‌మ‌స్య‌తో కూడా ఇబ్బంది ప‌డుతున్నట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. సాకోలోని మిల‌ట‌రీ ట్రైనింగ్ బేస్‌పై దాడి చేస్తాన‌ని హెచ్చ‌రించాడు. మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న రాబ‌ర్ట్ కార్డ్‌ను రెండు వారాల పాటు ఆస్ప‌త్రిలో ఉంచి చికిత్స అందించారు. ఇక బుధ‌వారం రాత్రి లెవిస్ట‌న్‌లోని బౌలింగ్ ఆల్లేతో పాటు రెస్టారెంట్ బార్ వ‌ద్ద రాబ‌ర్ట్ కార్డ్ కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

కాల్పుల‌కు తెగ‌బ‌డ్డ రాబ‌ర్ట్ కార్డ్‌ను ప‌ట్టుకునేందుకు ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంద‌ని పోలీసులు తెలిపారు. లెవిస్ట‌న్ ప్ర‌జ‌లు త‌మ ఇండ్ల‌లోనే ఉండాల‌ని, బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచించారు. తలుపుల‌కు లాక్ వేసి ఉంచాల‌ని సూచించారు. రాబ‌ర్ట్ కార్డ్ కాల్పులు జ‌రిపిన అనంత‌రం వైట్ సుబారు మీద ప‌రారీ అయిన‌ట్లు పోలీసులు ధృవీక‌రించారు. ఇందుకు సంబంధించిన చిత్రాల‌ను పోలీసులు విడుద‌ల చేశారు. 

Latest News