⦁ గ్రాఫిక్స్ పనులతో ఆలస్యం.
⦁ అనిల్ రావిపూడి సినిమా తర్వాతే..?
⦁ ఈ బర్త్‌డేకు స్టాలిన్ రీ–రిలీజ్
Mega Star Vishwambhara | విధాత సినిమా ప్రతినిధి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న “విశ్వంభర” చిత్రం విడుదలపై గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు ఏడాదిన్నర క్రితం గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, అనూహ్యంగా వాయిదా పడుతూ వస్తోంది. మొదట చిరంజీవికి చికెన్ గున్యా రావడం, ఆపై గ్రాఫిక్స్ పనుల ఆలస్యం కారణంగా ఇప్పటివరకు సినిమా విడుదలపై ఎటువంటి స్పష్టత లేదు.
ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం, విశ్వంభర(Vishwambhara) చిత్రం సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ OG, బాలకృష్ణ అఖండ2 లాంటి సినిమాలు కూడా థియేటర్లలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మళ్లీ పోటీని తప్పించుకోవాలన్న ఉద్దేశంతో సినిమాను మరోసారి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని వాయిదాలు పడితే ఈ సినిమా నేరుగా 2026 వేసవికే వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మెగా 157’ సినిమా 2026 జనవరి 10కి స్లాట్ బుక్ చేసుకుంది.
ఈ సినిమాకి సంబంధించి గత సంవత్సరం ఆగస్టు 22న విడుదలైన టీజర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా గ్రాఫిక్ పనుల(Trolls on poor VFX)పై విమర్శలు వెల్లువెత్తగా, అప్పటి నుంచి చిత్ర బృందం ప్రమోషన్ విషయంలో పూర్తి మౌనం పాటిస్తోంది. ఈ కాలంలో వచ్చిన ఒకే ఒక్క అప్డేట్ – ‘రామ రామ’ అనే లిరికల్ సాంగ్ – అది కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. యువి క్రియేషన్స్ వంటి నిర్మాణ సంస్థ ఉన్నా, ప్రమోషన్‌లో మాత్రం దారి తప్పినట్టు కనిపిస్తోంది. మెగాస్టార్ ఈ చిత్రం విషయంలో అసలు మాట్లాడటమే లేదు.
ఇదిలా ఉంటే, చిరంజీవి(Chiranjeevi) అభిమానుల నిరీక్షణకు భిన్నంగా, నిర్మాతలు మరో అప్‌డేట్‌గా “విశ్వంభర” స్థానంలో “స్టాలిన్” సినిమాను తిరిగి తెరపైకి తీసుకురానున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విశ్వంభర విడుదల చేసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్న వేళ, “స్టాలిన్(Stalin)” రీ-రిలీజ్ నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్దగా వర్కౌట్ కాలేకపోయినా, దానిలోని మాస్ ఎలిమెంట్స్ అభిమానులకు నచ్చాయి. త్రిషతో పాటలు, అనుష్క స్పెషల్ సాంగ్, మణిశర్మ బీజీఎం, ఇంటర్వల్ పాయింట్‌లో ప్రదీప్ రావత్‌కు చిరు ఇచ్చే వార్నింగ్ వంటి దృశ్యాలు ఇప్పటికీ ప్రేక్షకుల్లో మిగిలిపోయాయి.
అయితే అభిమానులు కోరుకునేది పాత సినిమాలు కాదు. కొత్తగా నిర్మించిన, గ్రాండ్ విజువల్స్‌తో కూడిన “విశ్వంభర”లాంటి సినిమాలే. “విశ్వంభర అడిగితే స్టాలిన్ ఇస్తారా?” అంటూ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తమవుతోంది. ఇటీవలే జగదేకవీరుడు అతిలోక సుందరి రీ-రిలీజ్‌కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు స్టాలిన్‌కు కూడా మేలు జరగవచ్చని ఎగ్జిబిటర్లు భావిస్తున్నప్పటికీ, అసలు సమస్య మాత్రం విశ్వంభర ఎప్పుడు వస్తుంది? అన్నదానిపై ఏ క్లారిటీ లేకపోవడమే.
విశ్వంభర చరిత్ర ఒకసారి చూద్దాం.
─ Aug 22, 2023: ‘Mega 156’ గా ప్రకటించి పూజ కార్యక్రమం నిర్వహణ, ప్రాజెక్ట్ ప్రారంభం
─ Oct 23, 2023 : అధికారిక పూజ వేడుకలు; ప్లాన్ ప్రకారం నిర్మాణ పనులు మొదలు
─ Nov 2023 – Jan 2024 : హైదరాబాద్లో నిర్మించిన 13 విభిన్న సెట్లపై జరిగిన షూటింగ్; మొదటి షెడ్యూల్ పూర్తి
─ Feb 2, 2024 : చిరంజీవి చిత్ర బృందంలో అధికారంగా చేరారు; జనవరి 10, 2025 రిలీజ్‌ను ప్రకటించారు
─ Feb – Apr 2024 : ‘హనుమాన్’ విగ్రహంతో కూడిన ఇంటర్వల్ సీన్లు, 26 రోజుల యాక్షన్ సీన్ షూట్
─ Aug 22, 2024 : చిరు బర్త్‌డే సందర్భంగా టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
─ Oct 13, 2024 : టీజర్ రిలీజ్ – కానీ గ్రాఫిక్స్‌పై తీవ్ర విమర్శలు
─ Apr 12, 2025 : మొదటి సింగిల్ “రామ రామ” విడుదల – కానీ ప్రమోషన్ పరిమితం.
─ Mar 2025 : మే 9, 2025 విడుదల అనుకున్నా, VFX పనులు పూర్తికాలేదు; OTT డీల్స్ కూడా ఫైనల్ కాలేదు.
─ Jun 29, 2025 : భారీ VFX పునఃసమీక్ష తర్వాత 2026 వేసవికి వాయిదా రూమర్లు.
─ Aug 22, 2025 : చిరంజీవి బర్త్‌డే సందర్భంగా “స్టాలిన్” రీ-రిలీజ్ ప్లాన్
చివరగా, ఈ సినిమా వాయిదాలకు కారణంగా చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్‌లను సమన్వయం చేయడం కష్టంగా మారే అవకాశమూ ఉంది. ఇప్పటికైనా చిత్ర బృందం గ్రాఫిక్స్ పనులు పూర్తి చేసి, ఒక ఫిక్స్‌డ్ విడుదల తేదీ ప్రకటిస్తేనే మెగా అభిమానులకు ఊరట కలుగుతుంది. లేకపోతే ‘విశ్వంభర’ పేరు వినగానే నిరాశే గుర్తుకొస్తుంది! ఇలా ఆలస్యంగా విడుదలైన ఏ చిత్రం కూడా విజయం సాధించిన దాఖలాలు లేకపోవడం కొసమెరుపు.