Site icon vidhaatha

Pawan Kalyan | వారాహి అమ్మవారి దీక్ష చేపట్టబోతున్న పవన్‌ కల్యాణ్‌..! అందుకోసమేనా..?

Pawan Kalyan | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టబోతున్నారు. 11 రోజుల పాటు ఆయన దీక్షను కొనసాగిస్తారు. ఇందులో భాగంగా రోజు కేవలం పాలు, పండ్లు, లిక్విడ్‌ ఫుడ్‌ మాత్రమే తీసుకోనున్నారు. గతేడాది జూన్‌లో పవన్‌ కల్యాణ్‌ వారాహి విజయయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.

యాత్ర సందర్భంలో వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. దీక్షను చేపట్టారు. చాతుర్మాస్య దీక్షను చేపట్టిన ఆయన.. నాలుగు నెలల పాటు దీక్షను కొనసాగించారు. ఆషాడం, శ్రావణం, భాద్రపదం, అశ్వీయుజమాసం కలిపి నాలుగు నెలల పాటూ దీక్షను చేశారు. చాతుర్మాస్య దీక్షలో ఉన్ననంత కాలం ఆహార నియమాలు పాటించేవారు. మితంగా సాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరించేవారు. అంతేకాదు పవన్ ఒక్కపూట మాత్రమే ఆహారం తీసుకునేవారు.. సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా పాలు, పండ్ల ఆహారంగా తీసుకునేవారు.

అలాగే పవన్ కల్యాణ్‌ దీక్షను విరమించే సమయంలో హోమాన్ని నిర్వహించేవారు. తాజాగా ఎన్నికల్లో తాను అనుకున్న విధంగా విజయం సాధించడంతో పాటు కూటమి ప్రభుత్వంలో డెప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దాంతో మరోసారి దీక్ష చేపట్టి అమ్మవారి మొక్కును చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పవన్‌ కల్యాణ్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు. జనవాణి కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు.

Exit mobile version