Samantha | అప్పటి వరకు సమంతతో సినిమాలు తీస్తూనే ఉంటా..! సుకుమార్‌ కామెంట్స్‌ వైరల్‌..!

  • Publish Date - April 9, 2024 / 05:00 PM IST

Sukumar | సమంత పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దక్షిణాదిలో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్నది. ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ దూసుకుపోతున్నది. సమంత కెరీర్‌లో ‘రంగస్థలం’ మూవీ సైతం బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రంగా నిలుస్తుంది. అయితే, ఈ చిత్రంలో మొదటగా సమంతను తీసుకోవాలని అనుకోలేదని డైరెక్టర్‌ సుకుమార్‌ వెల్లడించారు. చరణ్‌ కోసం ‘రంగస్థలం’ చిత్రం రాశానని.. సమంత కోసం మాత్రం రాయలేదని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ‘చిట్టిబాబు’ క్యారెక్టర్‌లో జీవించాడు. కుమార్‌ బాబు పాత్రలో ఆది పినిశెట్టి, రంగమ్మత్తగా అనసూయ భరద్వాజ్‌తో పలువురు నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ చిత్రంలో సమంత ‘లక్ష్మి’పాత్రలో అద్భుతమైన నటన కనబరిచింది. అయితే, ఈ చిత్రంలో సమంత డీగ్లామర్‌ రోల్‌లో అచ్చమైన పల్లెటూరు అమ్మాయి జీవించేసింది.

ఆ పాత్రలో సమంతను తప్ప మరో నటిని మనం ఊహించుకోలేం. సమంతపై దర్శకుడు సుకుమార్ ప్రశంసలు కురిపించారు. లక్ష్మి కోసం మొదట సమంతను అనుకోలేదని సుకుమార్‌ తెలిపారు. ‘రంగస్థలం’లో చరణ్ నటన అద్భుతమని సుకుమార్‌.. చరణ్‌ను దృష్టిలో పెట్టుకునే కథను రాసుకున్నట్లు తెలిపారు. హీరోయిన్ పాత్రను మాత్రం సమంత కోసం రాయలేదని.. హీరో, హీరోయిన్‌ ఇద్దరూ స్టార్స్ అయితే సెట్‌లో తాను మేనేజ్‌ చేయలేనేమోనని భావించానని.. అందుకే కొత్త అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవాలని భావించానన్నారు. సినిమా కథ ప్రకారం మంచి ఆర్టిస్ట్, తెలుగు వచ్చిన హీరోయిన్ కావాలని.. ఆ తర్వాత సమంత అయితే బాగుంటుందని నిర్ణయించుకొని తీసుకున్నట్లు సుకుమార్‌ తెలిపారు. ఇక షూటింగ్‌ సమయంలో సమంత నటన చూసి ఆశ్చర్యపోయానని.. ప్రతి సన్నివేశంలో అద్భుతమైన హావభావాలను పండించిందని కొనియాడారు. ఇక తాను సినిమాలు తీసినంత కాలం సమంతతో సినిమాలు చేస్తునే ఉంటానని సుకుమార్‌ తెలిపారు.

Latest News