Site icon vidhaatha

అభిమానులెవరూ ఆందోళన చెందవద్దు..!: చిరంజీవి

విధాత,హైదరాబాద్‌: తన మేనల్లుడు, నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్‌ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌ గాయపడ్డారు. తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ప్రమాదం జరగడంతో ఆయన బైక్‌పై నుంచి కిందపడిపోయారు. దీంతో అభిమానులు సోషల్‌మీడియా వేదికగా వరుస ట్వీట్లు పెడుతున్నారు. ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో సాయి ఆరోగ్యం గురించి తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు. సాయిధరమ్‌ తేజ్‌కుస్వల్పగాయాలయ్యాయని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చిరు తెలిపారు. అభిమానులెవరూ కంగారు పడొద్దని.. త్వరలోనే సాయి ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వచ్చేస్తాడని పేర్కొన్నారు. కాగా ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, అల్లు అరవింద్‌, త్రివిక్రమ్‌, నిహారిక, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌తోపాటు సందీప్‌ కిషన్‌ సైతం హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు.

ఆయన ఆరోగ్యంపై వైద్యుల్ని ఆరా తీశారు. అనంతరం అల్లు అరవింద్‌ మీడియాతో మాట్లాడుతూ.. సాయిధరమ్‌ తేజ్‌ క్షేమంగా ఉన్నాడని తెలిపారు. మరోవైపు సోషల్‌మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు సాయి తేజ్‌ గురించి ట్వీట్లు పెడుతున్నారు. ‘బ్రదర్‌ సాయిధరమ్‌తేజ్‌.. త్వరగా కోలుకోవాలి’ అని ఎన్టీఆర్‌ అన్నారు. రవితేజ, నిఖిల్‌, మంచు మనోజ్‌, కార్తికేయ, నిర్మాత కోన వెంకట్‌, దర్శకుడు శ్రీనువైట్ల తదితరులు సైతం తేజ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Exit mobile version