Site icon vidhaatha

న్యూస్ రీడింగ్‌లో త‌న‌దైన ముద్ర వేసిన శాంతి స్వ‌రూప్.. ఆయ‌న ప్ర‌త్యేక‌త ఏంటంటే..!

తొలి తెలుగు యాంకర్ శాంతిస్వరూప్ మలక్‌పేట యశోదా ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్నుమూసారు. గుండెపోటుకు గురైన ఆయన శుక్రవారం ఉదయం మృతిచెందారు. రెండురోజుల క్రితం శాంతి స్వరూప్‌కి గుండెపోటు రాగా.. కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం యశోదా ఆస్పత్రికి తరలించారు. దురదృష్టావశాత్తు చికిత్స పొందుతూనే ఇవాళ ఉద‌యం కన్నుమూశారు.ఆయ‌న మ‌ర‌ణ వార్త ప్ర‌తి ఒక్క‌రిని క‌లిచివేస్తుంది. దూరదర్శన్ అంటే వార్తలు .. వార్తలు అంటే శాంతి స్వరూప్ అన్నంతగా ఆయన తెలుగు వీక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌ర‌య్యారు. ఆయన మృతి దిగ్భ్రాంతికి గురి చేస్తుంద‌ని ప్ర‌తి ఒక్క‌రు క‌న్నీటి ప‌ర్యంత‌మవుతున్నారు. శాంతి స్వరూప్‌కి కన్నీటి నివాళులు అర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు లోకేష్‌. శాంతి స్వరూప్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇక తొలితరం తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతిస్వరూప్‌ మరణం బాధాకరమని తెలంగాణ ముఖ్య‌మంత్రి అన్నారు.. మీడియా రంగంలో ఆయ‌న త‌న‌దైన ముద్ర వేశార‌ని , వారి కుటుంబ స‌భ్యుల‌కుప్రగాఢ సానుభూతిని తెలుపుతున్న‌ట్టు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఇక ఏపీ సీఎం వైస్ జగ‌న్ మోహన్ రెడ్డి కూడా నివాళులు అర్పించారు. ప‌రిమిత సాంకేతిక ప‌రిజ్ఞానం ఉన్న రోజుల నుండి శాంతి స్వ‌రూప్ మార్గ‌ద‌ర్శ‌క ప్ర‌య‌త్నం చాలా మంది వార్త ప్ర‌సార‌కుల‌కి స్పూర్తినిచ్చిందిని తెలిపారు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి కూడా తెలియ‌జేశారు. అయితే శాంతి స్వరూప్ పేరుకు తగ్గట్టుగానే మాటల్లో, చేతల్లో ఆయన శాంతి స్వరూపుడే.. వార్తలు, సమాచారం, ‘జాబులు- జవాబులు’, ‘ధర్మసందేహాలు’ కార్యక్రమం ఇలా దేనినైనా చాలా ప్ర‌శాంతంగా చొచ్చుకుపోయి అల‌రిస్తుంటారు.

దూరదర్శన్‌లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కాగా, ఆయ‌న 1983 నవంబర్‌ 14న సాయంత్రం 7 గంటలకు దూరదర్శన్‌లో ఫస్ట్‌ బులెటిన్‌ చేశారు. అప్పట్లో ఆ బులెటిన్‌ ఒక సంచలనం సృష్టించింది. లైవ్‌లో న్యూస్‌ చదివి మెప్పించారు శాంతిస్వరూప్‌. 1978లోనే ఉద్యోగంలో చేరినప్పటికీ వార్తలు మాత్రం 1983 న‌వంబ‌ర్‌లో చదివారు. పదేళ్లపాటు టెలీప్రాంప్టర్‌ లేకుండా పేపర్‌ చూసి చెప్పేవారు.న్యూస్ రీడర్‌గా లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును కూడా శాంతిస్వరూప్ అందుకున్నారు.శాంతిస్వరూప్‌కు భార్య‌, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎలాంటి కార్యక్రమమైనా ఏకధాటిగా నడపగల దిట్ట శాంతి స్వ‌రూప్‌. వార్తలు చదవడంలో ఆయనది విలక్షణమైన శైలి అని చెప్పాలి. సంతోష‌క‌ర‌మైన వార్త‌ల‌ని ఒక‌లా, బాధాక‌ర‌మైన వార్త‌ల‌ని ఒక‌లా చ‌దివి మంచి పేరు తెచ్చుకున్నారు.. 2004వరకు ఆయన వార్తలు చదివారు. 20ఏళ్లకు పైగా తెలుగు వార్తలు చదివిన ఏకైక వ్యక్తిగా శాంతి స్వరూప్ రికార్డులకు ఎక్కారు.1980 ఆగస్టు 21న యాంకర్‌ రోజారాణితో శాంతిస్వరూప్ వివాహం కాగా, వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. వారిద్ద‌రు అమెరికాలో స్థిరపడ్డారు. శాంతి స్వరూప్‌ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే కాగా, ఆయ‌న‌కి రామంతాపూర్‌లోని టీవీ కాలనీలో నివాసం ఉంది.

జనవరి 7, 2011 వరకు దూరదర్శన్‌లో ప‌ని చేసిన శాంతి స్వ‌రూప్‌ని బాగా గుర్తుండిపోయిన విషాదకరమైన వార్త..? సంతోషకరమైన వార్త ఏది అని ఆయనను ఓసారి ప్రశ్నించగా.. త‌న‌కు రెండు కూడా విషాద వార్తలే అని చెప్పారు. మొదటి విషాదకరమైన వార్త వ‌చ్చేసి ప్రధాని ఇందిరాగాంధీ మరణం అని ఆయ‌న చెప్పాలి. 16 బుల్లెట్లు ఆమె ఒంటికి తగిలాయి మ‌రణించ‌డం చాలా బాధ అనిపించింద‌ని అన్నారు. ఇక . రెండో వార్త ఏది అని అడగితే. ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ మరణ వార్త అని అన్నారు. ఇందిరాగాంధీ మరణం కంటే రాజీవ్ గాంధీ గారి మరణము చాలా దారుణమని.. ఆయన శరీరం ముక్కలు ముక్కలూ అయిపోయింద‌ని ఇప్పటికీ ఆ వార్త నాకు గుర్తుండి పోయిందని ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చారు. ఇక త‌న మ‌ధుర జ్ఞ‌ప‌కాలు ఏంట‌ని అడ‌డ‌గా, కేంద్ర ప్రభుత్వం నుంచి షా కమిషన్ కి సంబంధించిన పది పేజీలఇంగ్లీషు రిపోర్టును తెలుగులోకి అనువదించకుండా, ముందుగానే చదివి అర్థం చేసుకుని, ఇంగ్లీషు రిపోర్టు కాగితాలను రిఫరెన్స్ కోసం చేతిలో ఉంచుకుని, మధ్యమధ్యలో దానిని పరిశీలిస్తూ తెలుగులో ప్రత్యక్షంగా చదవ‌డం అనేది మ‌ధుర జ్ఞాప‌కాల‌లో ఒక‌టిగా చెప్పారు

Exit mobile version