అద్దె కట్టలేదని అర్ధరాత్రి రోడ్డుపై పడేశారు
నామ్ తమిళర్ కట్చి నేత, నటుడు, దర్శకుడు సీమాన్ తనను మోసం చేశారంటూ గతంలో వార్తల్లోకి ఎక్కిన నటి విజయలక్ష్మి తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఎవరికైనా కష్టాలు ఎక్కువైతే సినిమా కష్టాలంటూ పోల్చుతారు. కానీ ఆ కష్టాలు నటి విజయలక్ష్మికి వచ్చాయి.
టీనగర్ హబీబుల్లా రోడ్డులోని ఓ సర్వీసు అపార్ట్‌మెంట్‌లో విజయలక్ష్మి, ఆమె సోదరి ఉన్నారు. సోదరి అనారోగ్యంతో ఆస్పత్రి పాలై…శనివారం రాత్రి డిశ్చార్జ్ కావడంతో ఇంటికి వచ్చారు ఇద్దరూ. కానీ తమ ప్లాట్‌లో మరో వ్యక్తి ఉండడంతో మేనేజర్ విఘ్నేశ్వరన్‌ను ప్రశ్నించారు. మూడు నెలలుగా అద్దె చెల్లించని దృష్ట్యా సామన్లు మరో గదిలో పెట్టినట్టు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన విజయలక్ష్మి, మీడియాకు సమాచారం అందించారు. తన సామాన్లు బయట పడేశారని, రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఈ ప్లాట్‌లో రాజకీయ నేత హరినాడర్ అన్నయ్య తీసుకొచ్చి ఉంచారని, ఆయన్ను సంప్రదించకుండా తనను రోడ్డున పడేశారని కన్నీటి పర్యంతం అయ్యారు. సామాన్లు బయట పడేయలేదని, ఓ గదిలో ఉంచామని, తమ ప్లాట్ సిబ్బంది శివాను చెప్పుతో కొట్టడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మేనేజర్ విఘ్నేశ్వరన్ వాపోయాడు.