Ananya Nagalla | యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల (Ananya Nagalla) నటించిన చిత్రం పొట్టేల్ (Pottel). ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానున్నది. ఈ క్రమంలో చిత్రం యూనిట్ పబ్లిసిటీ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నది. ఇటీవల మూవీ టీం పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. ఇందులో అనన్య నాగళ్లకు కాస్టింగ్ కౌచ్ (Cast Couch)పై ప్రశ్న ఎదురైంది. ఇండస్ట్రీలో కమిట్‌మెంట్‌ని ఫేస్ చేశారా? అంటూ ఓ లేడీ జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఇటీవల కాలంలో కాస్టింగ్ కౌచ్ అంశం చర్చనీయాంశంగా మారింది. కేరళలో జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ సంచలనంగా నిలిచిన విషయం తెలిసిందే. పలువురు నటులపై కేసులు సైతం నమోదయ్యాయి. తాజాగా మీడియా సమావేశంలో అనన్య నాగళ్లకు ఇదే ప్రశ్న ఎదురుకావడం అందరికీ షాక్‌కు గురి చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య మాట్లాడుతూ.. ‘కమిట్‌మెంట్ ఇచ్చారా’ ? అని నేరుగా ఎలా అడుగుతారు ? వాళ్లకు సంస్కారం లేదా? అని అనిపించిందని చెప్పింది. మీడియా సమావేశంలో కుటుంబీకులతో పాటు బంధువులు ఉన్నారని చెప్పింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చి ఐదేళ్లు అవుతుందని.. అప్పటి నుంచి రోజూ ఇంట్లో కుటుంబంతో ఫైట్ చేస్తూ షూటింగ్‌కు వస్తానని చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీలోకి రావడం కుటుంబీకులకు ఇష్టం లేదన్నారు. బంధువులు కూడా పరువు తీశారనే ఫీలింగ్‌లో ఉంటారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఈసారి పొట్టేల్ మూవీతో కుటుంబీకులు, బంధువుల నుంచి ప్రశంసలు పొందానని చెప్పింది.
తన తల్లి పొట్టేల్ సినిమాతో నాగురించి గర్వంగా చెప్పుకుంటుందనే నమ్మకం ఉండేదని.. ఈ ప్రశ్నతో అంతా తలకిందులైనట్లుగా అనిపించిందని వాపోయింది. ఒకవేళ సక్సెస్ వచ్చినా.. ఇలాంటివి చూస్తే ఈ అమ్మాయి అలాంటివి చేసింది కాబట్టే అక్కడి వరకు వెళ్లిందనుకుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మ ఏ ఫంక్షన్‌కు వెళ్లినా డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా మళ్లీ తన గురించి బ్యాడ్‌గా మాట్లాడుతారని.. తాను ఎదురుచూసిన గర్వపడే క్షణాలు వెళ్లిపోయినట్లుగా అనిపించిందని తెలిపింది. జర్నలిస్ట్ ఆ ప్రశ్న అడిగిన సమయంలో పెద్దగా బాధగా అనిపించలేదని.. ఆ తర్వాత బాధపడ్డానని చెప్పింది. అయితే, మీడియా వారంతా తనకు మద్దతు తెలుపడం, మిగతా జర్నలిస్టులు క్షమాపణలు కోరడంతో తనపై వారికున్న అభిమానం చూసి ఆనందపడ్డానంటూ అనన్య చెప్పుకొచ్చింది.