Janhvi Kapoor | సెలబ్రిటీలపైనే అందరి దృష్టి వారిపై ఉంటుంది. మరీ ముఖ్యంగా సినిమా స్టార్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్లినా అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా అభిమానులతో పంచుకుంటుంటారు. అలాగే, బయటకు ఎక్కడకు వెళ్లినా.. షాపింగ్‌మాల్స్, ఎయిర్‌పోర్టులు, జిమ్‌లు, పార్టీలు, ఎలాంటి ఈవెంట్‌లకు అయినా ఫొటోగ్రాఫర్స్ ఎగబడి మరీ ఫొటోలు తీసుకునే విషయం తెలిసిందే. అయితే, చాలామందికి ఒక డౌట్ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది. అయితే, ఈ సెలబ్రిటీలు ఎప్పుడు.. ఎక్కడికి ఎలా వెళ్తున్నారనే వివరాలు అసలు ఫొటోగ్రాఫర్లకు ఎలా తెలుస్తుంది..? అనే డౌట్ సహజంగా వస్తుంది. అయితే, ఈ విషయంపై బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం జాన్వీ నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ మూవీ మే నెలాఖరులో విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ ఫోటోగ్రాఫర్స్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. హీరోయిన్స్‌ను ఫొటోగ్రాఫర్స్ చాలా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వెతుక్కుంటూ వస్తారని.. సినిమా ప్రమోషన్ ఏమైనా ఉంటే డబ్బులు ఇచ్చి మరీ వారిని పిలవాలని పేర్కొంది. ప్రస్తుతం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమా ప్రమోషన్ జరుగుతోందని.. అందుకే నా ఫోటోలు తీసేందుకు వచ్చారన్నారు. సినిమా షూటింగ్ లేనప్పుడు, నేను నా పనిలో బిజీగా ఉన్న సమయంలోనూ ఫొటోగ్రాఫర్స్ తన కారును ఫాలో అవుతారని.. కష్టపడి నన్ను ఫొటోలు తీసి దానికి డబ్బులు తీసుకుంటారని చెప్పింది. బాలీవుడ్‌లో ప్రతి సెలబ్రిటీకి ఓ రేట్ ఉంటుందని కీలక విషయం బయటపెట్టింది.
స్టార్ యాక్టర్స్ అయితే ఒక రేటు.. చిన్న యాక్టర్స్ అయితే ఒక రేటు ఉంటుందని.. స్టార్ సెలబ్రిటీలు అయితే వాళ్లను వెతుక్కుంటూ ఫొటోగ్రాఫర్స్ వెళ్తారని.. పెద్ద స్టార్ కాకపోతే ఫొటోగ్రాఫర్స్‌ని స్టార్స్ పిలవాల్సిందేనని జాన్వీ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. గతంలో హీరోయిన్ ప్రియమణి సైతం ఇదే విషయం చెప్పింది. హిందీ సినిమాల్లో నటించినప్పుడు అక్కడి ఫొటోగ్రాఫర్స్‌పై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. సెలబ్రిటీలు ఫొటోగ్రాఫర్లకు ఫోన్ చేసి రమ్మని చెప్పి ఫోటోలను తీయించుకుంటారని.. కానీ ఫొటోగ్రాఫర్లు తమ కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఫొటోలు క్లిక్ మనిపిస్తారని చెప్పుకొచ్చింది. తాజాగా జాన్వీకపూర్ సైతం అదే వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం జాన్వీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.