KALKI 2898 AD Movie Review | కల్కి 2898 ఏడీ ‌‌– మరపురాని మరోలోకపు అనుభవం

గత కొంత కాలంగా యావత్​దేశం ఎదురుచూస్తేన్న చిత్రం కల్కి 2898 ఏడీ ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ప్రభాస్​ అభిమానులు, సగలు తెలుగు ప్రేక్షకుల ఊహల మేరకు ఈ సినిమా ఉందా? లేదా? ఇప్పుడు చూద్దాం.

  • Publish Date - June 27, 2024 / 02:47 PM IST

సినిమా : కల్కి 2898 ఏడీ
జానర్​ : తెలుగు ఎపిక్​ ఫిక్షన్​
నటీనటులు : ప్రభాస్​, అమితాబ్​ బచ్చన్​, కమల్​ హాసన్​, దీపికా పడుకునే, దిశా పటానీ, బ్రహ్మానందం…ఇతరులు
దర్శకుడు : నాగ్​ అశ్విన్​
నిర్మాత : అశ్వనీదత్​
బ్యానర్​ : వైజయంతీ మూవీస్​
రన్​టైమ్​ : 3 గం. ఒక నిమిషం

మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన,కల్కి 2898 AD(KALKI 2898 AD)  ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటించిన ప్రళయకాలానంతర చిత్రం. ఈ చిత్రం కురుక్షేత్ర యుద్ధం(Kurukshetra War) యొక్క చివరిలో ప్రారంభమవుతుంది – ఇక్కడ అశ్వత్థామ Ashwatthama (అమితాబ్ బచ్చన్) నుదిటిపై శిరోమణి పెకలించబడిన గాయంతో యుగాంతం వరకు జీవించమని శ్రీకృష్ణుడిచే శపించబడ్డాడు.

శాపవిముక్తి కోరిన అశ్వత్థామను తన దశావతారమైన కల్కి(kalki)ని కాపాడాల్సిన బాధ్యత నీదేనని, ఆ సమయంలో నీ మణి నీవద్దకు చేరుతుందని అభయమిస్తాడు  శ్రీకృష్ణుడు(ముఖం చూపించలేదు).  అక్కన్నుంచి ఈ చిత్రం నేరుగా కురుక్షేత్రం తర్వాత 6,000 సంవత్సరాలకు , కాశీ(Varanasi) నగర నేపధ్యంలోకి చేరుతుంది. అప్పటికే భూలోకం దుర్భర పరిస్థితుల్లో ఉంటుంది.  ఒక దుష్ట శక్తి(కమల్ హాసన్-kamal Haasan), తన సొంత ప్రపంచం(కాంప్లెక్స్​)లో అధికారాన్ని అనుభవిస్తూ, ప్రమాదకరమైన కార్యక్రమంలో ఉంటాడు.  అదేమిటి.? అశ్వత్థామ, సుమతి (దీపికా పదుకొణె) మరియు భైరవ (ప్రభాస్) – అందరూ గొప్ప ప్రయోజనం కోసం కలుస్తారు. అది ఏమిటి? అనేది ఇక సినిమా చూసే తెలుసుకోవాలి. అన్నట్లు ఈ చిత్రంలో విజయ్​ దేవరకొండ, మాళవికానాయర్​, దర్శకులు రాజమౌళి, రామ్​గోపాల్​వర్మ కూడా తళుక్కున మెరిసారు.

భారతీయ ఇతిహాసం మహాభారతం(Maha Bharatha) యొక్క చివరి ఘట్టం నుండి ప్రారంభమయ్యే కథాంశాన్ని ఎంచుకొని, దాన్ని భవిష్యత్తుకు అనుసంధానించాలనే నాగ్ అశ్విన్(Nag Ashwin) ఆలోచన ఆసక్తికరంగా ఉంది. చిత్ర VFX బృందం అతని ఆలోచనను అద్భుతంగా అమలుచేసారు. కాకపోతే సినిమాలో అక్కడక్కడా  స్క్రీన్‌ప్లే లోపాలున్నా , ప్రథమార్థం చాలా నెమ్మదిగా సాగడం మీ సహనాన్ని పరీక్షిస్తుంది.  రాక్సీ (దిషా పటాని), బ్రహ్మానందం వంటి కొన్ని పాత్రలు విసుగు పుటిస్తాయి. వీటికి కథతో సంబంధం ఉండదు. సినిమా ద్వితీయార్థంలో అశ్వత్థామ , భైరవల మధ్య ప్రీ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాయి. ముఖ్యంగా స్పెషల్​ ఎఫెక్ట్స్​ అద్భుతంగా తీర్చిదిద్దారు.

యాక్షన్​ పార్ట్​ కూడా  స్టైలిష్‌గా డిజైన్​ చేసారు.  నిజం చెప్పుకోవాలంటే,  ఇటీవలి కాలంలో అత్యుత్తమ VFX వర్క్​ ఈ సినిమాలోనే చూడగలం.  నాగ్ అశ్విన్ మరియు అతని బృందం ఇంత మంచి ఔట్​పుట్​ రావడానికి ఎంత శ్రమ పడ్డారో అర్థమవుతుంది.  జోర్డ్జే స్టోజిల్జ్‌కోవిక్ (Djordje Stojiljkovic)సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా, ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసేలా ఉంది.. అయితే, రచనలోని కొన్ని లోపాల వల్ల కథలోని భావోద్వేగాలు సరిగా ప్రతిబింబించలేదు.  సినిమా కొంచెం గంభీరంగా సాగుతున్నట్లనిపించినప్పుడు, ఒక హాస్య సన్నివేశం వచ్చి, దాన్ని తేలికపరిచి మనకు కొంచెం ఉల్లాసం కలిగిస్తుంది.

అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ అదరగొట్టాడు. నిజానికి అతనే ఈ సినిమాకు హీరో, ప్రభాస్ కాదు. తన బాడీ లాంగ్వేజ్‌తోనూ, ఎక్స్‌ప్రెషన్స్‌తోనూ అమితాబ్​ తన నటనా చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. ఈ వయస్సులో కూడా అమితాబ్​ తన పాత్ర పట్ల అంత అంకితభావంతో ఉండటం, సినిమానంతా తనే మోయడం చూస్తే, గొప్ప భారతీయ నటులలో ఒకడెలా అయ్యాడో తెలుస్తుంది. .

భైరవగా ప్రభాస్ పాత్రం ఇంకా బాగుండాల్సింది. కథలో ఆ ఆస్కారం కూడా ఉంది. కానీ, పాత్రలో డెప్త్ లేదు. నిజానికి, చాలా సమయాల్లో అతని పాత్ర నిస్తేజంగా ఉంటుంది. అతని డైలాగ్ డెలివరీ ఇంకా సమస్యల్లోనే ఉంది. పార్ట్ 2లో మనం ప్రభాస్ హీరోయిజం ఎక్కువగా చూస్తామేమో. గర్భిణి సుమతిగా దీపిక పర్వాలేదు. నిజానికి, ఆమెకు పెద్దగా నటించాల్సిన అవసరం రాలేదు. కాకపోతే కథ అంతా తన చుట్టే తిరగడం వల్ల మంచి అభిప్రాయం కలుగుతుంది. కమల్ హాసన్ పాత్ర పరిమితంగానే ఉన్నప్పటికీ అతని ఆహార్యం మరియు పాత్రను డిజైన్ చేసిన తీరు చాలా బాగున్నాయి. క్లైమాక్స్‌లో అతని పాత్ర రెండవ భాగానికి చక్కగా బాట వేసింది.

ఓవరాల్‌గా సినిమా ఒక వీఎఫ్‌ఎక్స్‌ వండర్‌(Visual Wonder). ఆద్యంతం ఒక అవెంజర్స్​ లాంటి ఇంగ్లీష్​ సినిమా చూసిన భావన కలుగుతుంది. మన సినిమాలు కూడా ఈ స్థాయిలో గ్రాఫిక్స్​ను వాడగలవా అనే సందేహాన్ని కల్కి 2989 సమూలంగా తుడిచిపెట్టేస్తుంది. కుటుంబసమేతంగా చూడదగ్గ ఓ ఫాంటసీ ప్రపంచం ఇది. పిల్లలు, పెద్దలు సమానంగా ఆనందిస్తారు.

విధాత రేటింగ్​ : 3.25/5

Latest News