Site icon vidhaatha

Tirumala | అక్టోబర్‌ ఒకటిన తిరుమలలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.. బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసిన దేవస్థానం

Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరుగనున్నాయి. వేడుకల కోసం బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. వేడుకలకు ముందు అక్టోబర్‌ ఒకటిన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. తమిళంలో కోయిల్ అంటే ‘పవిత్ర పుణ్యక్షేత్రం’, ఆళ్వార్ అంటే ‘భక్తుడు’, తిరు అంటే ‘శ్రేష్ఠo’, మంజనం అంటే ‘స్నానం’. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి, ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం. ఈ సమయంలో అన్ని దేవతా మూర్తులను, ఇతర వస్తువులను గర్భగుడి నుంచి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన ‘పరిమళం’ అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు.

శ్రీవారి ప్రధాన మూర్తికి కూడా ఒక తెల్లని వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఒక మహా యజ్ఞంలా జరుగుతుంది. తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి, లోపల దేవతలు, దీపం, ఇతర పూజ వస్తువులను మరల లోనికి తీసుకొస్తారు . అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు. ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతుంది. సంవత్సరానికి నాలుగు సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. టీటీడీ అక్టోబర్ 1న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని (ప్రోటోకాల్ వీఐపీలు మినహా) రద్దు చేసింది. కనుక సెప్టెంబర్ 30న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమని స్పష్టం చేసింది. భక్తులు గమనించి సహకరించాలని టీటీడీ కోరింది.

Exit mobile version